భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

5, డిసెంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

రవీంద్రభారతిలో బాలు విగ్రహమెందుకో.. అసలు ముచ్చట గిదే

sp-balasubrahmanyam-statue-in-ravindra-bharathi

భారత్ సమాచార్, హైదరాబాద్: జర్నలిజంలోకి వచ్చాక కొన్ని పదాలు రాయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ తెలంగాణలో నిందాస్తుతికి మనోభావాలు కాల్చుకునే సంప్రదాయం లేదు కాబట్టి దైర్యంగా రాస్తున్న. రవీంద్ర భారతి ముందు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తుంది. అది చర్చ అయితే బాగుండేది. కానీ.. అది చర్చ కాదు! విద్వేషం, ఆధిపత్యం వైపు సాగుతోంది. వాస్తవానికి కొన్ని విగ్రహాలు అవసరం. ఏ విగ్రహాలు అనేది ఆ సమాజం ఉన్న పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ఏ పరిస్థితులలో ఉన్నది? ఆత్మగౌరవం, అస్తిత్వం, నీళ్లు, నిధులు, ఉద్యోగాల విషయంలో సమైక్యాంధ్ర పాలకుల చేతిలో అత్యంత హేయనీయమైన దాడికి గురైన తెలంగాణ.. దేశంలోనే అత్యంత చైతన్యవంతమైన ఉద్యమం ద్వారా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. కానీ.. ఇప్పటికే ఆంధ్ర పాలకుల విద్వేషానికి, ఆదేశాలకు లొంగిపోయిన తెలంగాణ అస్తిత్వం శరం తప్పినట్లు కనిపిస్తోంది. 

తెలంగాణోళ్ల దిష్టే తాకిందా..?

తెలుగు తల్లి ఫ్లైఓవర్ కి తెలంగాణ‌ తల్లి ఫ్లై ఓవర్ అని పేరు పెడితే వెక్కిరిస్తారు. కాస్ట్లీ బిచ్చగాళ్ళం అని తెలంగాణ‌ బిడ్డ సరదాగా అంటే వైషమ్యాలు‌ పెంచుతారు. తెలంగాణోల్ల‌ దిష్టి తాకి కోనసీమ‌ కొబ్బరి‌ చెట్లు మాడిపోయాయని అవమానిస్తారు.  బాలు‌ విగ్రహం కాదు మావాళ్ల విగ్రహం‌ పెట్టుకుంటం అని ఆందోళన‌ చేసినప్పుడు‌‌ అనునయించకపోగా ఆగ్రహిస్తారు.  ఆంధ్రలో ఏ ఒక్క తెలంగాణ వ్యక్తికి సంబంధించిన ఏ చిహ్నమూ‌ లేనప్పుడు తెలంగాణలో ఇంత రెచ్చగొట్టినప్పుడు ఆందోళన సహజం.. వాటిని చర్చలతో పోగొట్టకుండా రెచ్చగొట్టడం ఆంధ్ర సమాజానికి అస్సలు తగదు. తెలంగాణ‌లో‌ బాలు‌ మీద‌నో ఆయన గాత్రం మీదనో వ్యతిరేకత కాదు.. కేవలం‌ అస్థిత్వం కోసం పోరాటం అంతే!

 

గిదీ మా మట్టి రా బై.. ఈడా గట్లనే ఉంటది:

ఇప్పుడు బాలు విగ్రహం రవీంద్ర భారతిలో పెడితే ఏమవుతుంది? మేలు జరగడం ఏమో కానీ చరిత్ర వక్రీకరణ జరుగుతుంది.  ముందు తరంలా మీకు పాటంటే తెల్వదు అందుకే మా ప్రాంతం గాయకున్ని మీ అధికార భవనం ముందు పెట్టుకుండ్రు అంటారు. జస్ట్ లైక్ హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టినట్లే.  మా అమరులు గద్దర్, అందెశ్రీ విగ్రహాలు అమరావతిలో, బెజవాడలో పెట్టే నియ్యతి వంచక, బూటక, ఆంధ్రా సమాజానికి ఉందా ? మేమెందుకు బాలసుబ్రమణ్యం విగ్రహం మా గడ్డమీద పెట్టుకోవాలి ? ఏంటి ఆయన గొప్ప తనం అంతకన్నా గొప్ప గాయకులు మాకు లేరా ? బాలసుబ్రమణ్యం ఎవరో 77 ఏళ్ల మా నాయనమ్మకు తెలియదు.  ‘వందనాలు వందనాలు‘ అనే పాట మాత్రం ఆమె నోటా విన్నా. అదీ పాటకు ఉన్న గొప్పతనం. సిగ్గులేని మా తెలంగాణ పౌర సమాజం.. పదేళ్ళ కిందనే టాంక్ బండ్ ను శుద్ది చేస్తే బాగుండేది. ఈరోజు తెలంగాణ పాటను పాడడాన్ని నిరాకరించిన బాలసుబ్రమణ్యం అనే ఆంధ్రా గాయకుడి విగ్రహం రవీంద్ర భారతిలో వ్యతిరేకించడంలో ఏ మాత్రం తప్పు లేదు.  పెట్టడాన్ని వ్యతిరేకించండి.  సంగీతానికి సాహిత్యానికి కులం ఏంటి ప్రాంతం ఏంటి అనకండి. అంతకు మించి హంతక వంచక భాష లేదు. సంగీతానికి సాహిత్యానికి ఆఖరికి శ్మశాన వాటిక కు కూడా కులం ప్రాంతం ఉంది. తెలంగాణ కోసం నిస్వార్దంగ ఉద్యమాలు చేసి త్యాగాలు చేసిన వాళ్లలో పావు వంతు మందికి కూడ సరైన గుర్తింపు గౌరవం దక్కలేదనే సోయి ఎందరీకి ఉంది? మా జాతి పాట పాడు అంటే నిస్సంకోచంగా పాడను అన్నడు. తెలంగాణలో వేరే ఏ మూలన పెట్టుకున్న ఎం పర్లేదు. కానీ నగరం నడిబొడ్డున పెడతాం అంటే నోరుమూసుకుని ఉంటరా. 30వేల పాటలు పుణ్యానికి పాడిండా? లేకుంటే ఇక్కడి జాతి ప్రజలకు ఏదైనా మేలు చేసిండా?…గాయకుడైన ఆయన మీద గౌరవం ఉంది. కానీ మా నెత్తిన మోసేంత పనులేం చేయలే.. సినిమా వాళ్లని ఎలాగో ఆంధ్ర సమాజం నెత్తిన పెట్టుకొని తిరుగుతుంది. తెలంగాణకు ఆ దౌర్భాగ్యం రాకూడదు.  అయినా మా తెలంగాణ బడ్డులకు తెలివి లేదు. మమ్మల్ని ఎవడైనా ఎక్కిపోవచ్చు. ఇది చరిత్ర చెప్పిన, చెబుతున్న సత్యం. అలా అని వైవిధ్యతను కాదనే నీచ సంస్కృతి తెలంగాణది కాదు. మేము ఎవడీ నుంచి ఏమీ కోరుకోవడం ఆత్మగౌరవం, అస్తిత్వం కోసం మమల్ని బిచ్చగాళ్లని చేసే ప్రక్రియతోనే ఇబ్బంది. 

ఎలచ్చన్లు అస్తేనే ఆత్మగౌరవం గుర్తొస్తుంది:

తెలంగాణా ఆత్మగౌరవం అనే బీఆర్ఎస్ వాళ్ల డొల్లతనం కూడా ఇప్పుడు అర్థమవుతోంది. వీళ్లకి అధికారం కోసం తపన తప్ప మిగతా విషయాల మీద పెద్ద పట్టింపు ఏమాత్రం లేదు.  “తెలంగాణా దిష్టి తాకి కొబ్బరి చెట్లు పోయాయి” అంటే నోరు మెదపలేదు. కనీస నిరసన లేదు. ఇప్పుడు అధికార భాషాసాంస్కృతిక శాఖ బిల్డింగ్ ముందు ఉద్దేశ పూర్వకంగా బాలు విగ్రహం అంటున్నా వీళ్లకి పట్టిందీ లేదు.. ఎలక్షన్లు వస్తే తప్ప తెలంగాణ ఆత్మగౌరవం గుర్తు రాదేమో వీళ్లకి!

గట్టిగ ఉన్నదున్నట్లు:  

బాలూ మీద ద్వేషం ఎవరికీ లేదు. బాలూ పాటమీదా తిరస్కారమూ మాకు లేదు. కానీ పదేపదే ఒకే భాష అనే సాకుతో ఎందుకీ ఆధిపత్యపు దోరణి అన్నదే మా ప్రశ్న. బాలూ విగ్రహం పెట్టటం కాదు మా అభ్యంతరం, రవీంద్ర భారతిలో ఎందుకు? అన్నది మాత్రమే. తెలంగాణ ప్రాంతపు కళాకారులు ఉండగా వారిని నిర్లక్ష్యం చేస్తూ ఒక అధికారిక భవనం ముందు బాలూ విగ్రహం దేనికి? ఆంధ్రాలో తెలంగాణా కళాకారుల విగ్రహం పెట్టమని మేము అడగలేదు, పెట్టవద్దు అంటే ఇద్దరి భాష ఒకటే కదా… తెలుగు మన భాష అని దేబేరించి అడుక్కోనూ లేదు. సినిమా రంగానికి బాలూ చేసిన కాంట్రిబ్యుషన్ మీద మాకే అబ్యంతరం లేదు. ఫిలిం నగర్‌లో ఆయన విగ్రహం పెట్టొచ్చు, లేదా ఏ సినిమా స్టుడియో దగ్గరలో అయినా పెట్టొచ్చు… సినీ కళాకారులు ఉండే కృష్ణానగర్, యూసుఫ్ గూడా లాంటి ప్రాంతాలలోనూ ఆయన విగ్రహం పెట్టొచ్చు. కానీ, “కుదరదు రవీంధ్ర భారతి ముందే ఉండాలి అలా ఉంటేనే మా ఆత్మలకు తృప్తి” అంటారు. తెలంగాణా రాష్ట్రంలో “తెలుగు తల్లి ఫ్లై ఓవర్” ఉంటుంది. ఆ తెలుగు తల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సింబాలిక్‌గా ఉన్న ప్రతీక కదా (భాషకు కాదు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి ఆ పేరు అనుకున్నప్పుడు) తెలంగాణాలో ఆ పేరెందుకు అంటే… “మా తెలుగు భాష మాట్లాడద్దు” అన్నప్పుడు నోళ్లు లేవవు, “మీ దిష్టి వల్ల మారాష్ట్రంలో కొబ్బరి చెట్లు పాడయ్యాయి” అని సాక్షాత్తూ ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అనొచ్చు, “అది సరదాగా అన్నాను” అని తప్పుకోవచ్చు… అక్కడ మా అభిప్రాయానికి ఏ విలువా ఉండదు. కానీ ఇప్పుడు బాలూ విగ్రహం తెలంగాణ ప్రభుత్వంలోని అధికార భాష, సంస్కృతిక శాఖ భవనం ముందే ఎందుకు? అని అడిగితే “నరకానికి పోతారు, ప్రాంతీయ దురభిమానం” అంటూ మాట్లాడతారు.. అయినా… రవీంద్ర భారతి అంటే శాలువాలూ, చప్పట్ల కేంద్రం అంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రే మాట్లాడుతుంటే వాళ్లు అలా మాట్లాడక ఇంకేం చేస్తారు. ఇక కొంతమంది బాలు పాడిన ముప్పై వేల పాటలు (అన్ని భాషలు కలిపి )విని ఆస్వాదించడానికి ఒక జన్మ లేదా పది జన్మలు సరిపోవు అంటున్నారు (బాధలో అభిమానం హద్దులు దాటి అలా అంటున్నారు అనుకుందాం). ఎవరైనా తనకు నచ్చిన కొన్ని పాటలు మాత్రమే విని ఆస్వాదించగలరు.. అవి బాలు వైనా.. ఘంటసాల వైనా.. కిశోర్ కుమార్.. మహమ్మద్ రఫీ.. ముఖేష్ వైన ..నిజానికి బాలు కూడా తను పాడిన అన్ని పాటలు ఆస్వాదించ లేడు. నాకు కూడా వీళ్లందరూ పాడిన కొన్ని పాటలు మాత్రమే ఇష్టం..అవే మళ్లీ మళ్లీ వింటు ఆస్వాదిస్తాను. ఇలా అంటున్న వీళ్లందరీకి బాలు పాడిన నలభై పాటలు తెలిసి ఉండవు. కనీసం నాలుగు పాటలు కంఠస్థం వచ్చి ఉండవు. మొత్తానికి  బాలు ఒక తెలివైన..లౌక్యం తెలిసిన.. ప్రతిభ గల గాయకుడు అని తీర్పు చెప్పేయొచ్చు అంతే!

చివరి ప్రశ్న:

సమాజానికి గద్దర్, గూడ అంజయ్య, బెల్లి లలితలకన్నా, ఎస్పీ బాలసుబ్రమణ్యం చేసిన సేవ ఎంటి అనేది ప్రశ్న. ఎవరు ఏ సమాజంకోసం, ఏ త్యాగం చేసి పాడారనేది ప్రశ్న. ఎవరు ప్రజల కోసం పాడారు, ఎవరు వ్యాపారం కోసం పాడారు అనేది ప్రశ్న. ఎవరు మేలుకొలుపుకోసం పాటలు పాడారు, ఎవరు మత్తుజల్లి నిద్రపుచ్చడానికి పాడారు అనేది ప్రశ్న. పాటకోసం శరీరంలో బుల్లెట్లు దించుకున్నవాళ్లూ, పాశవిక హత్యకు గురైన వాళ్లెక్కడ? కోట్లరూపాయలు, కీర్తి కిరీటాలూ వసూలు చేసుకున్న వ్యక్తి ఎక్కడ? చివరిగా ముఖ్యమైన మాట ఏమంటే, వివక్ష మీద రెండు ప్రాంతాలుగా విడిపోయిన తర్వాత పరస్పర పునర్విచారణ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో గద్దర్ విగ్రహం, తెలంగాణాలో వంగపండు, షేక్‌నాజర్ విగ్రహాలుంటే బావుంటుందేమోగానీ, మధ్యలో ఈ ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహం గురించిన గొడవెందుకు?

నివురుగప్పిన నిప్పు.. గిక్కడ గట్లనే ఉంటది:

తెలంగాణ అనేది ఎప్పుడూ నివురు గప్పిన నిప్పు. చిన్నగా గాలి వీస్తే చాలు దావణాలమై మండుతుంది. ఊరికూరికే మనోభావాలు గాయపరచుకునే బ్యాచ్. మిలియన్ మార్చ్‌ను గుర్తుపెట్టుకుంటే మంచిది. అది కూడా పిడికెడు మంది అక్కడిక్కడే తీసుకున్న నిర్ణయం. గడిచిన తొమ్మిదేళ్ళలో టీఆర్ఎస్ బొందపెట్టిన తెలంగాణ వాదాన్ని మళ్ళీ సమాధిలోంచి లేపే ప్రయత్నం చేస్తున్నట్లుంది కాంగ్రెస్. అమీర్‌పేట్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం. మొన్న రోశయ్య విగ్రహం. తెలుగుదేశ కాంగ్రెస్ అమ్ములపొదిలో ఇంకెన్ని అస్త్రాలు?  సినిమా అనేది ఫక్తు వ్యాపారం. టాక్స్ ఎగ్గొట్టే మాఫియాకు రాయితీలు ఇవ్వడమే వృధా అంటే, రాయితీలకు భూములు, టికెట్ల రేట్ల పెంపు, విగ్రహాలు అంటూ డ్రామాలు చేయడం నాన్సెన్స్ వ్యవహారం. అందరూ తెలుగువాళ్ళే అనుకున్నప్పుడు. మీ తెలుగును మా మీద రుద్దడం కాదు. మా తెలుగునూ హత్తుకోండి. మా కీర్తి కిరీటాలను విగ్రహాలు చేసి ఊరేగించండి. 1956 నుంచి 2014 దాకా దాదాపు అరవై ఏండ్లు మీరు రుద్దిన బాకీ తీర్చుకోండి. తెలియదంటే చెప్పండి జాబితా ఇస్తాం.  దేవుడు అనుకునే పుట్టపర్తి సాయిబాబా ఔట్లెట్‌నే తుక్కు తుక్కు చేశారు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలని మనవి.