భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

19, డిసెంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసే కుట్రను విరమించుకోవాలి

f1391fda-4e72-47da-8b94-07561606ca84

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కేంద్ర బిజెపి ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్-2025 పేరుతో నూతన బిల్లును పార్లమెంటులో ఆమోదం కోసం పెట్టడాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహబుబాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇసంపేల్లి సైదులు తీవ్రంగా ఖండించారు. నెల్లికుదురు మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ లో గురువారం కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ.. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసే కుట్రను కేంద్రప్రభుత్వం విరమించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వలన రాష్ట్రంలో లక్షలాదిమంది ఉపాధికి దూరమై వలసలు వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేని సమయాల్లో ఉపాధి చూపాలని పేదలు, వ్యవసాయ కార్మికులు, గిరిజనులు,దళితులు ఐక్యంగా వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అప్పటి యూపీఏ ప్రభుత్వంపై పోరాడి 2005లో ఉపాధి హామీ చట్టాన్ని సాధించుకున్నారని గుర్తు చేశారు. ఉపాధి హామీ చట్టం వలన గత మూడు దశాబ్దాలుగా కోట్లాదిమంది పేదలు, గిరిజనులు, దళితులు, వ్యవసాయ కార్మికుల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఎంతగానో దోహదం చేసిందని అన్నారు. రాష్ట్రంలో పనులు లేక సుదూర రాష్ట్రాలకు వలసలు వెళ్లే దుస్థితిని ఉపాధి హామీ చట్టం కొంతవరకు నివారించగలిగిందన్నారు. ఈ చట్టాన్ని పట్టణాల్లో సైతం అమలు చేయాలనే డిమాండ్లు వస్తున్న క్రమంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం కుట్రపూరితంగా చట్టాన్ని పూర్తిగా రద్దు చేసేందుకు పూనుకోవడం దుర్మార్గమైన చర్య అని ధ్వజమెత్తారు. ఉపాధి హామీ చట్టం స్థానంలో ప్రభుత్వాల దయాదాక్షిన్యాలపై ఆధారపడి ఉపాధి పనులు చూపాలనే ఉద్దేశంతో పథకం రూపంలో మార్చడం బిజెపి, ఆర్ఎస్ఎస్ భూస్వామ్య మనువాద భావజాలానికి నిదర్శనమని ఆరోపించారు. ఇక నుంచి కేంద్రం నుంచి 100శాతం నిధులు ఇవ్వాల్సిన స్థానంలో కేవలం 60 శాతమే ఇస్తాము, మిగిలినది రాష్ట్రాలు భరించాలని చెప్పడం అంటే చట్టం లక్ష్యాన్ని పూర్తిగా కాలరాయడమేనని అన్నారు. జాబ్ కార్డుల రేషన లైజేషన్ పేరుతో ప్రస్తుతం ఉపాధి పొందుతున్న కోట్లాదిమంది కార్డులను నిర్ధాక్షణంగా తొలగించేందుకు కొత్త నిబంధన చేర్చిందని విమర్శించారు.

గ్రామాల్లో వ్యవసాయ పనులు జరుగుతున్న 60 రోజుల కాలవ్యవధి వరకు ఉపాధి పనులు నిలిపివేయాలనడం భూస్వాములు, ధనిక రైతులపై ఆధారపడమని చెప్పడమేనని అన్నారు. కేంద్రప్రభుత్వం ఉపాధి హామీ చట్టం స్థానంలో తెస్తున్న నూతన ఉపాధి పథకాన్ని వ్యతిరేకించాలని, ఉపాధికి గ్యారెంటీ ఇచ్చే పాత చట్టాన్ని అమలు చేసేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం పై ప్రజాస్వామ్యవాదులు, వ్యవసాయ కార్మికులు పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాడ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈ ఉప్పలయ్య, శ్రీను, వెంకన్న, ఐలేష్, శ్రీను, ఐలయ్య, భిక్షపతి, శేఖర్, సంపత్, రవి, ఐలయ్య, సురేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.