భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) సహకారంతో, హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో సోమవారం ‘మోసాలకు పూర్తి విరామం’ (ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్) పేరిట అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ అంతటా ప్రజల అవగాహనను పెంపొందించడం, సైబర్ నేరాలను నివారించడం లక్ష్యంగా ఆరు వారాల రాష్ట్రవ్యాప్త ప్రచారంలో భాగంగా దీనిని ఏర్పాటు చేశారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసు సూపరింటెండెంట్ హర్షవర్ధన్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ… వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాల ముప్పు, సైబర్ నేరస్థులు ఉపయోగించే సాధారణ మోసపూరిత పద్ధతులను వివరించారు. ప్రతిఒక్కరూ సైబర్ మోసానికి గురయ్యే అవకాశాలున్నాయని, మొబైల్ పరికరాలలో హానికరమైన సాఫ్ట్ వేర్ ను సులభంగా ఇన్ స్టాల్ చేయవచ్చన్నారు. ఇది బ్లాక్ మెయిల్, దోపిడీ, డేటా దుర్వినియోగానికి దారితీయొచ్చని ఆయన హెచ్చరించారు. ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ బెట్టింగ్ (ఇది తెలంగాణాలో నిషేధించారు), ఆన్ లైన్ చాటింగ్ లో పాల్గొనేటప్పుడు విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎందుకంటే, ఈ ప్లాట్‌ఫామ్‌లు తరచుగా వినియోగదారులను తీవ్రమైన ఆర్థిక, వ్యక్తిగత ప్రమాదాలకు గురిచేస్తాయని హర్షవర్ధన్ తెలియజేశారు.
సంగారెడ్డి పోలీసు సూపరింటెడెంట్ పరితోష్ పంకజ్ ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఓటీపీ మోసం, పెట్టుబడి మోసం, పార్శిల్ మోసం, డిజిటల్ అరెస్టు స్కామ్ లు, హానికరమైన ఏపీకే ఫైల్ ట్రాపులు, నకిలీ సోషల్ మీడియా ప్రొఫైళ్లతో సహా ప్రజలను ప్రభావితం చేసే వివిధ రకాల ఆన్లైన్ మోసాల గురించి ఆయన వివరించారు. సైబర్‌నేరాలకు దారితీసే సాధారణ తప్పులను ఎత్తిచూపారు. ఈ మోసం బారిన పడినవారు తక్షణమే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి కాల్ చేయడం ద్వారా, లేదా మోసం జరిగిన గంటల వ్యవధిలోనే cybercrime.gov.in ఫిర్యాదు చేయడం ద్వారా ఫలితం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్, డీన్-కోర్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ వీఆర్.శాస్త్రి అధ్యక్షత వహించారు. సైబర్-సురక్షిత తెలంగాణను నిర్మించడంలో సహాయపడటానికి వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోవడానికి, అనుమానాస్పద లింకులు, ఫోన్‌కాల్‌లను నివారించడానికి, ఆన్లైన్ లావాదేవీలను ధృవీకరించడానికి, సైబర్ అవగాహనను ప్రోత్సహించడానికి విద్యార్థులతో సైబర్ భద్రతా ప్రతిజ్జ చేయించారు. ఈ అవగాహనా కార్యక్రమంలో భాగంగా, పోస్టర్లు, ఆడియో క్లిప్పులు, జింగిల్స్, ఇతర సమాచారా సామాగ్రిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నోడల్ అధికారి డీఎస్సీ కేవీ. సూర్యప్రకాశ్, బీటెక్ తొలి ఏడాది సమన్వయకర్త ప్రొఫెసర్ పి.త్రినాథరావు సమన్వయం చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, పటాన్ చెరు ఎస్‌హెచ్‌వో వినాయక్ రెడ్డి, టీసీఎస్ బీ ఇన్సిస్పెక్టర్ రవి, ఎస్బీ ఇన్సిస్పెక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.