భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: ఐడిఏ బొల్లారం పోలీస్ స్టేషన్‌ను అమీన్పూర్‌లో కలపడాన్ని నిరసిస్తూ స్థానిక బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ ను ఎత్తివేసి అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి జిన్నారం మాజీ జెడ్పిటిసి కొలన్ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 40 ఏళ్లకు పైబడిన చరిత్ర ఉన్న బొల్లారం పోలీస్ స్టేషన్ తొలగించడం అన్యాయమని, పారిశ్రామిక వాడలో 25వరకు కాలనీలు 70 వేల జనాభా, 350 పరిశ్రమలు ఉన్న బొల్లారానికి ప్రభుత్వం నిర్ణయంతో రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన ప్రతి విషయానికి ప్రస్తుతం అమీన్పూర్ కు పరుగులు తీయాల్సిన పరిస్థితిని కల్పించారని, స్థానికంగా 80 శాతానికి పైగా వలస కుటుంబాలే ఉంటాయన్నారు. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఉండడం వల్ల వారికి పోలీసుల రక్షణ కరువు అవుతుందని, సమస్యను ప్రభుత్వం వెంటనే గుర్తించి ఐడిఏ బొల్లారంలో పోలీస్ స్టేషన్‌ను పునఃరుద్ధరించాలని డిమాండ్ చేశారు. బొల్లారం పోలీస్ స్టేషన్ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
BHARATH SAMACHAR DIGITAL
2, జనవరి 2026, శుక్రవారంభారత్ సమాచార్