భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, జనవరి 2026, బుధవారంభారత్ సమాచార్

హోరా హోరీగా సాగిన కబడ్డీ, వాలీబాల్ పోటీలు

589d8d79-d973-4b3f-8155-95f525577eee

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల క్రీడా ఆవరణలో సిజిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద స్ఫూర్తితో నిర్వహించిన ఓపెన్ టు ఆల్ కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీలు చివరి నిమిషం వరకు ఉత్కంఠ భరితంగా కొనసాగి అత్యంత వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు సాగిన ఈ పోటీల్లో ప్రతి మ్యాచ్ హోరా హోరీగా కొనసాగింది. చివరి క్షణం వరకు ఫలితం తేలని స్థాయిలో ప్రత్యర్థి జట్లు నువ్వా నేనా అన్నట్టుగా పోరాడాయి. సిజిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో పురుషులతో పాటు మహిళలకు కూడా ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల యువతతో పాటు జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన జట్లు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాయి. కబడ్డీ, వాలీబాల్ మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగడంతో క్రీడా ఆవరణ ప్రేక్షకులతో కిటకిటలాడింది.

 

ఈ పోటీలను రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హనుమంత్ రెడ్డి ప్రత్యేకంగా వీక్షించారు. గ్రామీణ స్థాయిలో ఇలాంటి క్రీడా పోటీలు జరగడం వల్ల యువతకు మంచి అవకాశాలు లభిస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఆయన హాజరుతో పోటీలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. సోమవారం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామి వివేకానంద యువతకు చూపిన మార్గం నేటి తరానికి ఎంతో అవసరమని, క్రీడలతో పాటు సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి సరైన దిశ చూపించవచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, స్థానిక యువత, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

క్రీడా పోటీలు ముగిసిన అనంతరం విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. మొదటి బహుమతిగా 50 వేల రూపాయలు, రెండో బహుమతిగా 30 వేల రూపాయలు, మూడో బహుమతిగా 20 వేల రూపాయలు, నాలుగో బహుమతిగా 10 వేల రూపాయలను అందజేశారు. పోటీల నిర్వహణలో సహకరించిన నిర్వాహకులు, రిఫరీలు, స్వచ్ఛంద సేవకులను కూడా ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నేటితరం యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రీడల వైపు దృష్టి సారించాలని సూచించారు. క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, మనశ్శాంతి, స్నేహభావం పెరుగుతాయని తెలిపారు. సిజిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలకు భవిష్యత్తులోనూ అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు.

 

కార్యక్రమం ముగింపు సందర్భంగా పలువురు ప్రముఖులు సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డిని, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డిని ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతను క్రీడల వైపు నడిపించేలా ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. వాలీబాల్ పోటీల్లో మైత్రి ఫౌండేషన్ గుమ్మడిదల జట్టు ప్రథమ స్థానం సాధించగా, ఇంద్రకరణ్ టీం గుమ్మడిదల ద్వితీయ స్థానం, దాచారం టీం తృతీయ స్థానం, యాదవ టీం నాలుగో స్థానంలో నిలిచాయి. కబడ్డీ పోటీల్లో సిఎన్ఆర్ అనంతారం జట్టు ప్రథమ స్థానం దక్కించుకోగా, రైతు సంఘం గుమ్మడిదల రెండో స్థానం, రెడ్డి సంఘం, తెలంగాణ పోలీస్ అకాడమీ మూడో స్థానంలో నిలిచింది.

 

మహిళల విభాగంలో నిర్వహించిన పోటీలకు కూడా మంచి స్పందన లభించింది. స్వామి వివేకానంద జయంతితో పాటు క్రీడా పోటీల నిర్వహణ గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో పండగ వాతావరణాన్ని నెలకొల్పాయి. ఈ కార్యక్రమంలో ప్రధానవక్తగా ప్రముఖులు బ్రహ్మం హాజరై యువతకు తన సందేశాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, జిన్నారం వెంకటేష్ గౌడ్, ఎస్సై లక్ష్మీకాంత్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, రాజేష్, వైస్ చైర్మన్ చిమ్ముల నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, దేవేందర్ రెడ్డి, కబడ్డీ జిల్లా కన్వీనర్ ముక్తార్ జానీ, వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏ కృష్ణ, రవీందర్ చారి, విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు సద్ది విజయభాస్కర్ రెడ్డి, హుస్సేన్, శ్రీనివాస్ రెడ్డి, రాజశేఖర్, వేణు, రాజు, పొన్నాల శ్రీనివాస్ రెడ్డి, రైతు సంఘం అధ్యక్షులు సదానంద రెడ్డి, వర్తక సంఘం అధ్యక్షులు సత్యనారాయణ, ట్రస్టు సభ్యులు క్రీడాకారులు పాల్గొన్నారు.