భారత్ సమాచార్.నెట్, కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం ఎమ్మిగనూరులో ఘనంగా నివాళులర్పించారు. స్థానిక ఎంఆర్ఓ కార్యాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి సూచనల మేరకు మహాత్మా గాంధీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ శిబిరంలో సుమారు 152 మంది అభిమానులు, యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. మహానేత ఆశయాలకు అనుగుణంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎన్టీఆర్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.