భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ సమర శంఖారావాన్ని పూరించింది. వనపర్తి పట్టణంలో ఎమ్మెల్సీ, వనపర్తి మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ స్వామి గౌడ్, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీని చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందే పట్టణంలో పెద్ద ఎత్తున నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీ ఊహించని రీతిలో విజయవంతమైంది. అనుకున్న దాని కంటే కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో హాజరు కావడంతో గులాబీ శ్రేణులంతా తబ్బిబ్బయ్యారు. అనంతరం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో కార్యకర్తలతో స్వామి గౌడ్ తో పాటు నిరంజన్ రెడ్డిలు మాట్లాడారు.
వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో వనపర్తి మున్సిపాలిటీలో గులాబీ జెండా విజయకేతనం జరిగి తీరుతుందని ఇందుకు నిదర్శనమే ఈ భారీ మోటార్ సైకిల్ ర్యాలీ అని చెప్పారు. గడిచిన రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని, ప్రజలే మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం కాంగ్రెస్ కు చెబుతారని నిరంజన్ రెడ్డి, స్వామి గౌడ్ లు నిర్దేశం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ వేసే ఎత్తుగడలను దీటుగా ఎదుర్కొని ఓటర్లను వీలైనన్ని ఎక్కువసార్లు కలిసి ఓటును అభ్యర్థించాలని సూచించారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలేవి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని, కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ద్వారా ప్రకటింపజేసిన వాగ్దానాలు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. వీటన్నిటిపై ప్రజలు గుర్రుగా ఉన్నారని మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసి brs అభ్యర్థులు గెలుపొందే దాకా నాయకులు, కార్యకర్తలు విశ్రమించకూడదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే విజయం ద్వారా వచ్చే రోజుల్లో కేసీఆర్ మళ్ళీ సీఎం గా రాబోతున్నాడని మున్సిపల్ ఎన్నికల విజయాలు సంకేతిమిచ్చినట్లు అవుతుందని స్వామి గౌడ్, నిరంజన్ రెడ్డిలు పేర్కొన్నారు.