భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: వనపర్తి మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా బీసీలకు అవకాశం కల్పించాలని వనపర్తి నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కుందేళ్ళ అర్జున్ యాదవ్ డిమాండ్ చేశారు. వనపర్తి మున్సిపాలిటీ ఏర్పాటు లక్ష్మయ్య నుంచి నేటి చైర్మన్ గట్టు యాదవ్, మహేష్ వరకు జనరల్ లో కూడా బీసీలకే చైర్మన్ పదవీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు అలా కాకుండా అగ్రవర్ణ వ్యాపారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వొద్దన్నారు. వ్యాపారులకు వ్యాపార ఆలోచనలు తప్ప ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన వుండదన్నారు. గతంలో ఉన్న ఆనవాయితీ ప్రకారమే ముందుకు పోవాలని, మున్సిపాలిటీలో మెజారిటీ సభ్యులు బీసీలు ఉన్నందున ఆ అవకాశం బీసీలకే దక్కాలని మీడియా సమావేశంలో కోరారు.
ఛైర్మన్ పదవి బీసీలకు ఇవ్వకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు:
జిల్లాలో ఇప్పటికే అన్ని ప్రధానమైన పదవుల్లో అగ్రవర్ణ నాయకులే ఎమ్మెల్యేగా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్లుగా ఉన్నారన్నారు. దీన్నిబట్టి చూస్తే బీసీ సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఎంతో బీసీ సమాజం మొత్తం గమనిస్తుందన్నారు. వనపర్తి బీసీ సమాజం నివ్వురు గప్పినా నిప్పులా వున్నారని, సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెబుతారన్నారు. బీసీల ఆగ్రహానికి గురికాకుండా వనపర్తి మున్సిపల్ పీఠం బీసీలకు ఇవ్వాలని మరో సారి డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల పక్షపాత ధోరణితోనే ముందుకు వెళితే భవిష్యత్తులో తగిన మూల్యం కచ్చితంగా చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీసీ కౌన్సిలర్లు అందరూ ఏకతాటిపైకి వచ్చి బీసీలకే ఛైర్మన్ వచ్చే విధంగా ఎమ్మెల్యేపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయాలన్నారు.