భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తూప్రాన్ పట్టణంలో స్వయంభువుగా వెలసిన శ్రీ మల్లిఖార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. యాదవ సంఘం నాయకుడు తుమ్మెట శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆదివారం గంగాజల సంప్రోక్షణతో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాల్లో భాగంగా, సోమవారం శ్రీ మల్లిఖార్జున స్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవం, మంగళవారం రేణుకా ఎల్లమ్మ తల్లి కల్యాణం భక్తిశ్రద్ధలతో జరగనున్నాయి.
మూడు రోజుల పాటు సాగే ఈ జాతరలో ఒగ్గు పూజారుల సంప్రదాయ పూజలు, ఒగ్గు కథలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నదాన కార్యక్రమం, తీర్థప్రసాద వితరణ, విద్యుత్ దీపాల అలంకరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు. ఈ జాతరతో తూప్రాన్ పట్టణం భక్తి భావంతో కళకళలాడనుంది.