భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి జిల్లా: హత్నూర మండలం దౌల్తాబాద్‌లో దారుణం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో మంగళవారం రాత్రి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. నవపేట గ్రామానికి చెందిన ఎర్రోళ్ల లక్ష్మణ్ అనే యువకుడు తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని గమనించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కుటుంబ కలహాలే ఈ ఘటనకు ప్రధాన కారణమని తెలుస్తోంది. తన తండ్రితో గొడవపడిన లక్ష్మణ్, మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనతో మండలంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.