భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్ జిల్లా: హైదరాబాద్ గీతం స్కూల్ ఆఫ్ సైన్స్‌కు చెందిన పరిశోధక విద్యార్థి పప్పుల అశోక్ గణితశాస్త్రంలో డాక్టరేట్ సాధించారు. అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి. మల్లికార్జునరెడ్డి మార్గదర్శకత్వంలో ‘హైబ్రిడ్ డీప్ లెర్నింగ్ నమూనాలను ఉపయోగించి క్రిప్టోకరెన్సీ ధర అంచనా’ అనే అంశంపై ఆయన విశేష పరిశోధన చేశారు. బిట్ కాయిన్, ఎథేరియం వంటి డిజిటల్ ఆస్తుల ధరల అస్థిరతను ముందే ఊహించడంలో ‘BiLSTM-GRU’ వంటి హైబ్రిడ్ ఏఐ నమూనాలు సాంప్రదాయ పద్ధతుల కంటే మెరుగైన ఫలితాలనిస్తాయని అశోక్ తన సిద్ధాంత వ్యాసంలో నిరూపించారు.
ఈ పరిశోధన ఫిన్ టెక్ రంగంలోని పెట్టుబడిదారులకు, విశ్లేషకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రొఫెసర్ మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. అశోక్ సాధించిన ఈ విజయాన్ని గీతం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, రెసిడెంట్ డైరెక్టర్ వర్మ, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, అధ్యాపక బృందం అభినందించారు.