భారత్ సమాచార్.నెట్, యాదాద్రి భువనగిరి జిల్లా: భవిష్యత్తులో వ్యవసాయం, రక్షణ, వైద్యం వంటి అన్ని రంగాల్లో డ్రోన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని విజ్ఞాన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎన్. ఉషారాణి అన్నారు. దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ క్యాంపస్‌లో ‘డ్రోన్ టెక్నాలజీ’పై నిర్వహించిన మూడు రోజుల వర్క్‌షాప్ గురువారం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు ఈ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా అద్భుతమైన కెరీర్ అవకాశాలు పొందవచ్చని సూచించారు. పరిశోధనలను ప్రోత్సహించేందుకు సి-డాక్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఈ సందర్భంగా ప్రకటించారు.
యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ‘డ్రోన్ టెక్నాలజీ క్లబ్’ను ప్రారంభించామని, పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. వర్క్‌షాప్‌లో భాగంగా డ్రోన్ల తయారీ, అసెంబ్లీ, ఫ్లైయింగ్, డీజీసీఏ నిబంధనలపై విద్యార్థులకు ప్రయోగాత్మక అవగాహన కల్పించారు. చివరగా పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.