భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండల కేంద్రంతో పాటు బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామాలలో ఎస్సై చిర్ర రమేష్ బాబు ఆధ్వర్యంలో మంగళవారం రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న పోలీసులు, అనంతరం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్టులు పెట్టుకోవాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని కోరారు. “వేగం కన్నా ప్రాణాలు ముఖ్యం” అని గుర్తు చేస్తూ, ప్రమాదకరమైన మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామస్తులతో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. నిబంధనలు పాటించి ప్రమాద రహిత సమాజానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.