భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: చేగుంట, నార్సింగి మండలాల్లో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఇరవై రోజులుగా లారీలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వడదెబ్బకు ఇద్దరు రైతులు అస్వస్థతకు గురయ్యారని మండిపడ్డారు. అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదన్నారు. రైస్ మిల్లుల్లో ధాన్యం దింపడం లేదని, దింపిన చోట కిలోన్నర వరకు తరుగు పేరిట కోతలు వేస్తున్నారని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ హయాంలో ముందస్తు ప్రణాళికతో కొనుగోళ్లు జరిగేవని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. మరో రెండు, మూడు రోజుల్లో ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయకపోతే రైతుల తరఫున అసెంబ్లీ ముట్టడికి వెనుకాడబోమని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై అధికారులు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.