భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: రైతుల నుంచి వడ్ల కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించి వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్ సూచించారు. శుక్రవారం నర్సాపూర్ ప్రాంతంలోని పలు రైస్ మిల్లులను ఆయన ఆకస్మికంగా సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా మిల్లుల్లో వడ్ల నిల్వ, ప్రాసెసింగ్ విధానం, రోజువారీ వడ్ల స్వీకరణ, లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియలపై యాజమాన్యాలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. రైతుల నుంచి సాధ్యమైనంత ఎక్కువ వడ్లను ఆలస్యం లేకుండా కొనుగోలు చేయాలని మిల్ యాజమాన్యాలకు సూచించారు.
రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వడ్ల నిల్వ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, తడిసిన ధాన్యం వల్ల రైతులు నష్టపోకుండా అవసరమైన తార్పాలిన్లు, ఇతర ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్ల కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల పరిస్థితులను స్థానిక పోలీస్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. రోజువారీ వడ్ల కొనుగోలు, రవాణా వివరాలను నమోదు చేస్తూ, రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంట డీఎస్పీ నరేందర్ గౌడ్, నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి, ఎస్సై రంజిత్ రెడ్డి, ఇతర పోలీస్ సిబ్బంది ఉన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
30, మే 2026, శనివారంభారత్ సమాచార్