భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలోని మహిమాన్విత శ్రీ ముత్యాలమ్మ తల్లికి బుధవారం ఇనుగుర్తి పట్టణవాసులు అత్యంత వైభవంగా బోనాల జాతరను నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, గ్రామస్తులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఏటా నిర్వహించే ఈ సంప్రదాయ వేడుకలో భక్తులు భారీగా పాల్గొన్నారు. భక్తులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో కుటుంబ సమేతంగా తరలివచ్చి ఆలయ ప్రదక్షిణలు చేశారు. ఆలయ గర్భగుడి ముందు ముత్యాలమ్మ, మారమ్మ, పెద్దమ్మ, లోతుగుంట మైసమ్మ తల్లులకు ప్రత్యేకంగా పట్నాలు వేశారు. అనంతరం మహిళలు వేపాకులు, పసుపు కుంకుమలతో అలంకరించిన బోనాలను నెత్తిన పెట్టుకొని, డప్పు చప్పుళ్లు, శివశక్తుల పూనకాల మధ్య సామూహికంగా నైవేద్యాలను సమర్పించారు.
కొందరు భక్తులు కోళ్లు, పొట్టేళ్లతో మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో దిశ కమిటీ సభ్యులు గుజ్జునూరి బాబురావు, గుజ్జునూరి వెంకన్న(గడ్డం), గుజ్జునూరి శ్రీకాంత్, రామ్ సలీం, గుజ్జునూరి వెంకన్న, బూర ఐలయ్య, బూర ఇస్తారి, దేవులపల్లి మధుసూధన్, లక్ష్మయ్య, ఇసంపల్లి జానీ, మల్లెపాక రమేష్ తదితరులు మాట్లాడుతూ.. అమ్మవారి కృపతో గ్రామం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ వేడుకలో గ్రామ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని జాతరను జయప్రదం చేశారు.
BHARATH SAMACHAR DIGITAL
11, జూన్ 2026, గురువారంభారత్ సమాచార్