భారత్ సమాచార్.నెట్, నిర్మల్ జిల్లా: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద ప్రజలకు నాణ్యమైన, నమ్మకమైన వైద్య సేవలు అందించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా వ్యాప్తంగా అందుతున్న ప్రభుత్వ వైద్య సేవలపై ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలతో పాటు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్‌కు దీటుగా తీర్చిదిద్ది సేవలు అందించాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలని, ముఖ్యంగా సాధారణ ప్రసవాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులకు సూచించారు. వర్షాకాలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చిన్నారులకు నిర్ణీత సమయాల్లో టీకాలు వేయాలని, నిర్మాణంలో ఉన్న హెల్త్ సబ్ సెంటర్ల పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, వైద్య పరికరాల అవసరాలపై ఈ సందర్భంగా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, వైద్యాధికారి రాజేందర్, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి పర్యవేక్షకులు గోపాల్ సింగ్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ శారద, డీసీహెచ్ఎస్ కాశీనాథ్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.