భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, జూన్ 2026, మంగళవారంభారత్ సమాచార్

ఎస్ఐఆర్ ఫారాల పంపిణీ గడువులోగా పూర్తిచేయాలి: సుదర్శన్ రెడ్డి

a25bedaa-8e10-4b1d-a04f-ae52dc27c829

భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు.

సమీక్ష సమావేశంలో జిల్లాల వారీగా ఇప్పటివరకు పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాల వివరాలను పరిశీలించిన సుదర్శన్ రెడ్డి, ప్రతి బూత్ లెవల్ అధికారి (BLO) తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లి ఫారాలను అందజేయాలని స్పష్టం చేశారు. ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసే అధికారం కేవలం బీఎల్‌వోలకు మాత్రమే ఉంటుందని, ఇతర వ్యక్తులు ఈ ప్రక్రియలో పాల్గొనరాదని తెలిపారు. విధులు నిర్వహించే సమయంలో బీఎల్‌వోలు తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డులు ధరించాలని సూచించారు.

ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రతి ప్రాంతంలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. అలాగే ఎన్యుమరేషన్ యాప్‌ను వినియోగించే అధికారం కూడా బీఎల్‌వోలకు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.

ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను తప్పనిసరిగా తిరిగి సేకరించాలని, ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. ఓటరు జాబితాల ఖచ్చితత్వం కోసం ఈ ప్రక్రియ అత్యంత కీలకమని పేర్కొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమావేశమైన కలెక్టర్, ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోపు పంపిణీ పూర్తి చేసి, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహించాలని సూచించారు.

ఈ సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీఓ దేవీదాస్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.