భారత్ సమాచార్, భద్రాద్రికొత్తగూడెం జిల్లా: జిల్లాలో ట్రిపుల్ ఐటీ (IIIT) ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో కొత్తగూడెం 6వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ బి.ఎస్. రావు కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర చేపట్టారు. గురువారం ఉదయం 7 గంటలకు కొత్తగూడెంలోని గణేశ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన పాదయాత్రను ప్రారంభించారు. సుమారు 40 కిలోమీటర్ల మేర నడిచి భద్రాచలానికి చేరుకున్న డాక్టర్ బి.ఎస్. రావు అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ బి.ఎస్. రావు మాట్లాడుతూ, పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న కొత్తగూడెంలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని అన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర జిల్లాలు, నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం కొత్తగూడెంలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేస్తే స్థానిక విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందుబాటులోకి రావడంతో పాటు ప్రాంత అభివృద్ధికి కూడా దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
శ్రీరాముడిపై అపార భక్తి కలిగిన డాక్టర్ బి.ఎస్. రావు గతంలో కూడా అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా 2024 జనవరి 4న కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఆ యాత్ర ముగింపులో భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. అదే స్ఫూర్తితో మరోసారి భద్రాచలం వరకు పాదయాత్ర చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఈ పాదయాత్రలో 6వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని డాక్టర్ బి.ఎస్. రావుకు మద్దతు తెలిపారు. కొత్తగూడెంలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. ఈ డిమాండ్ నెరవేరితే జిల్లాలోని విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు లభించడంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యా రంగంలో మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.