భారత్ సమాచార్: ఆంధ్రప్రదేశ్‌లో వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ ఉచిత, రాయితీ బస్‌పాస్‌ల పంపిణీ చేపట్టింది. ప్రస్తుతం చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలోని ఆర్టీసీ డిపోల్లో బస్‌పాస్ కౌంటర్ల ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు నిర్ణీత దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి అవసరమైన ధ్రువపత్రాలతో డిపోల్లో సమర్పించడం ద్వారా బస్‌పాస్‌ను పొందవచ్చు. అలాగే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా అధికారులు కల్పించారు.
ఉచిత బస్‌పాస్‌ల విషయానికి వస్తే.. 12 ఏళ్లలోపు ఏడో తరగతి చదివే విద్యార్థులు, 18 ఏళ్లలోపు పదో తరగతి చదువుతున్న వారికి ఈ సౌకర్యం వర్తిస్తుంది. అయితే విద్యార్థి నివాసం నుంచి పాఠశాల లేదా కళాశాల వరకు గరిష్ఠంగా 20 కిలోమీటర్ల దూరం ఉండాలి. దరఖాస్తుకు పాస్‌పోర్ట్ సైజు ఫోటో, హెడ్‌మాస్టర్ లేదా ప్రిన్సిపల్ సంతకం, పాఠశాల స్టాంప్, స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు జిరాక్స్ తప్పనిసరి. నామినేషన్ ఐడీ కార్డు కోసం రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. ఈ బస్‌పాస్‌లు వచ్చే ఏడాది ఏప్రిల్ నెలాఖరు వరకు చెల్లుబాటులో ఉంటాయి.
విద్యార్థులకు 33 శాతం రాయితీతో నెలవారీ, మూడు నెలల, వార్షిక స్టూడెంట్ పెయిడ్ బస్‌పాస్‌లను కూడా ఏపీఎస్‌ఆర్టీసీ అందిస్తోంది. విద్యార్థి ఇంటి నుంచి స్కూల్ లేదా కాలేజీ వరకు 50 కిలోమీటర్ల లోపు దూరం ఉంటే ఈ పాస్‌లకు అర్హత ఉంటుంది. ప్రయాణ దూరాన్ని బట్టి బస్‌పాస్ ధర నిర్ణయించబడుతుంది. చిత్తూరు, తిరుపతి, తిరుమల, పుత్తూరు, పలమనేరు, కుప్పం, మంగళం, అలిపిరి, శ్రీకాళహస్తి, వెంకటగిరి, వాకాడు, సూళ్లూరుపేట తదితర డిపోల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు ఏపీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేయాలి. నమోదు పూర్తయిన తర్వాత లభించే రిజిస్ట్రేషన్ నంబర్‌ను ప్రింట్ తీసుకుని, దానిపై ప్రిన్సిపల్ లేదా హెడ్‌మాస్టర్ సంతకం, పాఠశాల స్టాంప్ వేయించి సంబంధిత ఆర్టీసీ డిపోలో సమర్పించాలి. పత్రాల పరిశీలన అనంతరం విద్యార్థులకు ఉచిత లేదా రాయితీ బస్‌పాస్ జారీ చేయబడుతుంది. దీంతో విద్యార్థులు తక్కువ ఖర్చుతో సురక్షితంగా విద్యాసంస్థలకు ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది.