భారత్ సమాచార్, (నెల్లికుదురు), మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్ జిల్లా కేంద్రం మానుకోటలోని కీర్తి గార్డెన్‌లో ఈ నెల 27న తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జిల్లా సర్పంచుల చైతన్య సదస్సుకు జిల్లాలోని అన్ని గ్రామాల సర్పంచులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్ పిలుపునిచ్చారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
ఈ సదస్సుకు తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధపెల్లి సిద్ధార్థ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ రావు, పురుషోత్తం రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మందిపల్లి వెంకట్, ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ గునుగంటి కమలాకర్ గౌడ్‌తో పాటు పలువురు రాష్ట్రస్థాయి నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు.
సదస్సులో సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలు, స్థానిక సంస్థల హక్కులు, గ్రామపంచాయతీల బలోపేతం, నిధులు, అధికారాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధిలో సర్పంచుల పాత్రను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చలు జరగనున్నాయని వివరించారు.
జిల్లాలోని ప్రతి గ్రామానికి చెందిన సర్పంచులు తమ రోజువారీ కార్యక్రమాలను పక్కనపెట్టి ఈ చైతన్య సదస్సులో తప్పనిసరిగా పాల్గొని, స్థానిక సంస్థల అభివృద్ధికి ఉపయోగపడే అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని మాదరి ప్రశాంత్ కోరారు.