భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

29, జులై 2026, బుధవారంభారత్ సమాచార్

హైదరాబాద్ రూపురేఖలు మార్చుతున్న హైడ్రా

381665-hydra

భారత్ సమాచార్, హైదరాబాద్: వర్షాకాలంలో వరదలు.. వేసవిలో నీటి ఎద్దడి.. పెరుగుతున్న కాలుష్యం వంటి సమస్యలతో సతమతమవుతున్న హైదరాబాద్ నగరానికి శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) కీలక చర్యలు చేపడుతోంది. 2024 జూలై 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైడ్రా, రెండేళ్ల కాలంలో అక్రమణలపై కఠిన చర్యలు తీసుకుని 3325 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించింది. ఈ భూముల విలువ సుమారు రూ.1.50 లక్షల కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.

నగరంలో ఒకప్పుడు సహజ వరద నియంత్రణ వ్యవస్థగా పనిచేసిన చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమణలకు గురై కనుమరుగవడంతో వరద సమస్య తీవ్రంగా మారింది. ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న సుమారు 1250 చెరువుల్లో సగానికి పైగా ఆక్రమణలకు గురైనట్లు గుర్తించారు. ఈ పరిస్థితుల్లో హైడ్రా చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. చెరువులను కేవలం నీటి నిల్వ ప్రాంతాలుగా కాకుండా పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తోంది.

హైడ్రా ఇప్పటివరకు మొదటి దశలో బతుకమ్మకుంట, కూకట్‌పల్లి నల్లచెరువు, బమృకున్-ఉద్-దౌలా చెరువు, తమ్మిడికుంట, సున్నం చెరువు, ఉప్పల్ నల్లచెరువు వంటి ఆరు చెరువులను పునరుద్ధరించింది. రెండో దశలో మరో 14 చెరువుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. నగరంలోని నాలుగు ప్రధాన చెరువులను మినీ ట్యాంక్‌బండ్లుగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టింది.

అంబర్‌పేటలోని బతుకమ్మకుంట పునరుద్ధరణతో గతంలో తరచూ వచ్చే వరద సమస్యకు పరిష్కారం లభించింది. కూకట్‌పల్లి నల్లచెరువు, తమ్మిడికుంట అభివృద్ధితో ఆయా ప్రాంతాల్లో వరద నీటి నిల్వ సమస్య తగ్గింది. ప్యాట్నీ నాలా ఆక్రమణల తొలగింపుతో సుమారు 40 వేల కుటుంబాలకు చెందిన 1.60 లక్షల మందికి వరద ముప్పు తగ్గిందని అధికారులు తెలిపారు.

హైడ్రా కేవలం చెరువులే కాకుండా ప్రభుత్వ భూముల పరిరక్షణపై కూడా దృష్టి సారించింది. ప్రభుత్వ భూముల ఆక్రమణలు తొలగించి 2665 ఎకరాలు, చెరువుల ఆక్రమణలు తొలగించి 454.11 ఎకరాలు, పార్కుల ఆక్రమణలు తొలగించి 90.39 ఎకరాలు, నాలాల ఆక్రమణలు తొలగించి 25.37 ఎకరాలు, రహదారులు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు తొలగించి 62.18 ఎకరాలు స్వాధీనం చేసుకుంది.

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో 816 ఎకరాల ప్రభుత్వ భూమిని, కుత్బుల్లాపూర్ గాజుల రామారంలో 300 ఎకరాలను, కొండాపూర్‌లో 40 ఎకరాలను, సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో 106 ఎకరాలను, శంషాబాద్ బహదూర్‌గూడలో 650 ఎకరాలను హైడ్రా పరిరక్షించింది. నగర భవిష్యత్ అవసరాలు, పర్యావరణ సమతుల్యత, వరద నియంత్రణ లక్ష్యంగా హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయి.

హైడ్రాకు అధికారికంగా హైపర్ పవర్