భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త, పత్రిక విలేకరి చోల్లేటి రమణ భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) (సీపీఎం)లో అధికారికంగా చేరారు. జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నర్సింహారెడ్డి భవన్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు రమణకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే వామపక్ష విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న చోల్లేటి రమణ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేశారని అన్నారు. అలాంటి వ్యక్తి సీపీఎం సిద్ధాంతాలపై విశ్వాసంతో పార్టీలో చేరడం పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని పేర్కొన్నారు. ప్రజల పక్షాన పోరాడే ప్రతి కార్యకర్తకు పార్టీ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ పేదలు, రైతులు, కార్మికులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడే పార్టీ సీపీఎమేనని అన్నారు. గ్రామంలో పెత్తందారీ, భూస్వామ్య ధోరణులకు వ్యతిరేకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం చోల్లేటి రమణ చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజా ఉద్యమాల్లో ఆయన చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
చోల్లేటి రమణ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై తనకు ఉన్న అవగాహన, సామాజిక బాధ్యతే తనను సీపీఎం వైపు ఆకర్షించిందన్నారు. పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలకు కట్టుబడి చివరి శ్వాస వరకు ఎర్రజెండా స్ఫూర్తితో ప్రజల కోసం పనిచేస్తానని తెలిపారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం కోసం పార్టీ ఆధ్వర్యంలో జరిగే ప్రతి ఉద్యమంలో చురుకుగా పాల్గొంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు, నెమ్మది వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు ముల్కలపల్లి రాములు, చెరుకు యాక లక్ష్మి, మట్టిపెల్లి సైదులు, కొట గోపి, నాగారపు పాండు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు ధనియాకుల శ్రీకాంత్ వర్మ, జాజిరెడ్డిగూడెం మండల కార్యదర్శి వజ్జే శ్రీనివాస్, మండల నాయకులు, గ్రామ శాఖ ప్రతినిధులు, డీవైఎఫ్ఐ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.