భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) వలిగొండ మండల సమితి సమావేశం మేడి దేవేందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎల్లంకి మహేష్, జిల్లా కార్యదర్శి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎల్లంకి మహేష్ మాట్లాడుతూ, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పోలీసు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన సివిల్ కానిస్టేబుల్ (కోడ్-21), ఏఆర్ కానిస్టేబుల్ (కోడ్-22) పోస్టులు లేకపోవడం జిల్లాలోని నిరుద్యోగ యువతను తీవ్ర నిరాశకు గురిచేసిందని విమర్శించారు.
ఆయన మాట్లాడుతూ 2021 డిసెంబర్లో జారీ చేసిన 317 జీవో ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న సమయంలో నల్గొండ, సూర్యాపేట తదితర జిల్లాలకు చెందిన పలువురు కానిస్టేబుళ్లను యాదాద్రి జిల్లాలో విధులకు కేటాయించారని తెలిపారు. అయితే ఆ కేటాయింపులు పారదర్శకంగా జరగలేదని ఆరోపించారు. అనంతరం పోలీసు వ్యవస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాను రాచకొండ కమిషనరేట్ నుంచి వేరు చేసినప్పటికీ, ఇతర జిల్లాలకు చెందిన సిబ్బందిని వారి స్థానిక కేడర్లకు బదిలీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
దీని ఫలితంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో గణనీయమైన ఖాళీలు ఏర్పడగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఖాళీలు లేకుండా పోయాయని ఎల్లంకి మహేష్ పేర్కొన్నారు. దీంతో స్థానిక నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఇతర జిల్లాలకు చెందిన కానిస్టేబుళ్లను వారి స్థానిక కేడర్లకు బదిలీ చేసి, వాస్తవిక ఖాళీలను గుర్తించి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ నయీమ్, వలిగొండ మండల కార్యదర్శి సుద్దాల సాయికుమార్, సహాయ కార్యదర్శి గుండెగాని నాగరాజు, మండల ఉపాధ్యక్షుడు కనకబోయిన నందు, కార్యవర్గ సభ్యులు సంఘీ కృష్ణ, కన్నెబోయిన శివసాయి, ఫణిధర్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.