భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, ఆగస్టు 2026, ఆదివారంభారత్ సమాచార్

చనిపోయాడనుకుని గంగలో వదిలేశారు.. 8ఏళ్ల తర్వాత ఇంటికి!

images (8)

భారత్ సమాచార్, బిహార్: చనిపోయాడని భావించి గంగానదిలో వదిలేసిన ఓ బాలుడు సరిగ్గా ఎనిమిదేళ్ల తర్వాత ప్రాణాలతో ఇంటికి తిరిగి రావడం బిహార్‌లో సంచలనంగా మారింది. బెగూసరాయ్ జిల్లా మానోపుర్ ముషహరి గ్రామానికి చెందిన రామ్‌ప్రీత్ దాస్, కవిత దంపతుల కుమారుడు రాహుల్‌కు 12 ఏళ్ల వయసులో పాము కాటేసింది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు నది వద్దకు వెళ్లిన సమయంలో విషసర్పం కాటుకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించినప్పటికీ బాలుడి పరిస్థితి విషమించిందని, చివరకు అతడు మరణించాడని భావించారు.

కొడుకు ఇక లేడని తీవ్ర విషాదంలో మునిగిపోయిన తల్లిదండ్రులు సంప్రదాయ పద్ధతిలో అయోధ్య ఘాట్ వద్ద గంగానది ప్రవాహంలో బాలుడి శరీరాన్ని వదిలేసి ఇంటికి తిరిగి వచ్చారు. అయితే వారి ఊహకు భిన్నంగా రాహుల్ ప్రాణాలతో బయటపడ్డాడని చెబుతున్నారు. నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని ఓ సాధువు గమనించి కాపాడినట్లు సమాచారం. అనంతరం అతడికి అవసరమైన చికిత్స అందించి తన వెంట ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌కు తీసుకెళ్లినట్లు రాహుల్ కుటుంబ సభ్యులకు వివరించినట్లు తెలుస్తోంది.

గోరఖ్‌పుర్‌లో సాధువుల సమక్షంలో రాహుల్ ఆధ్యాత్మిక విద్యను అభ్యసిస్తూ అక్కడే ఎనిమిదేళ్లపాటు పెరిగి పెద్దవాడయ్యాడని సమాచారం. ఈ సమయంలో అప్పుడప్పుడు తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల గురించి గురువుకు చెప్పేవాడని రాహుల్ తెలిపినట్లు తెలుస్తోంది. విద్య పూర్తయిన తర్వాత ముందుగా తన తల్లి వద్దకు వెళ్లి భిక్ష తీసుకురావాలని గురువు సూచించడంతో రాహుల్ తన స్వగ్రామానికి బయలుదేరాడు. ఎనిమిదేళ్ల తర్వాత గ్రామానికి చేరుకున్న అతడు తన తల్లితో పాటు కుటుంబ సభ్యులను పేరు పేరునా పలకరించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

అయితే రాహుల్ శరీరంపై ఉన్న పాత గాయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు అతడే తమ కుమారుడని నిర్ధారించుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో ఎన్నో ఏళ్ల తర్వాత కొడుకును సజీవంగా చూసిన తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. నదిలో కొట్టుకుపోతున్న తనను సాధువు కాపాడి గోరఖ్‌పుర్‌కు తీసుకెళ్లారని రాహుల్ చెప్పినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, అప్పటి పరిస్థితులపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.