భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, ఆగస్టు 2026, ఆదివారంభారత్ సమాచార్

ఇంటర్నెట్ కష్టాలు.. ప్రతిసారీ ఇదే సమస్య ఎందుకు?

580328-4

భారత్ సమాచార్, కూకట్‌పల్లి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం అమలు చేస్తున్న EJHS  (Employees and Journalists Health Scheme) ఆరోగ్య పథకం సేవల్లో కూకట్‌పల్లి కేంద్రంలో సాంకేతిక సమస్యలు పేషెంట్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నెలవారీ మందులు తీసుకునేందుకు కేంద్రానికి వస్తున్న వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న ఉద్యోగులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఇంటర్నెట్ సమస్యల కారణంగా గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న BSNL ఇంటర్నెట్ కనెక్షన్‌లో తరచూ అంతరాయం ఏర్పడుతున్నట్లు పేషెంట్లు చెబుతున్నారు. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో EJHSకు సంబంధించిన ప్రక్రియలు ముందుకు సాగక మందుల పంపిణీ ఆలస్యమవుతోందని వారు పేర్కొంటున్నారు. నెలవారీ మందుల కోసం సమయానికి కేంద్రానికి వచ్చినప్పటికీ సాంకేతిక సమస్యల కారణంగా ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కసారి కాదు.. ప్రతిసారీ ఇదే సమస్య ఎందుకు? అంటూ పేషెంట్లు ప్రశ్నిస్తున్నారు. ఇంటర్నెట్ అంతరాయం విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని వారు అంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న వారు గంటల తరబడి వేచి ఉండాల్సి రావడం మరింత ఇబ్బందికరంగా మారుతోందని పేర్కొంటున్నారు.

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని పేషెంట్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న BSNL కనెక్షన్‌కు అదనంగా మరో ప్రత్యామ్నాయ ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేసి, ఒక నెట్‌వర్క్‌లో సమస్య తలెత్తినప్పుడు మరో కనెక్షన్ ద్వారా సేవలు కొనసాగించాలని కోరుతున్నారు. EJHS సేవల్లో సాంకేతిక అంతరాయాలను నివారించేందుకు అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేపట్టి, పేషెంట్ల నిరీక్షణ సమయాన్ని తగ్గించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.