భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా వచ్చే ఏడాది జూన్ 27 నుంచి నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో విస్తృత ఏర్పాట్లు చేపడుతోందని రాష్ట్ర మద్యం, ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పుష్కరాలకు ఏడాది ముందుగానే మౌలిక వసతులు, పుష్కర ఘాట్లు, ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఆదివారం బాసరలో పర్యటించిన మంత్రి రూ.20 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పుష్కర ఘాట్ల నిర్మాణం, విస్తరణ, మరమ్మతులు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, గోదావరి నదీమాతకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రూ.354 కోట్లతో చేపట్టనున్న ఆలయ సమగ్ర అభివృద్ధి, నూతన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయడంతో పాటు భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. భవిష్యత్తులో పెరగనున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన మౌలిక వసతులను ముందుగానే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
గోదావరి పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. భక్తుల సౌకర్యం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైన మేరకు పుష్కర ఘాట్లను విస్తరించడంతో పాటు కొత్త ఘాట్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టాలని అన్నారు. మహిళల కోసం ప్రత్యేక డ్రెస్సింగ్ రూములు, మరుగుదొడ్లు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రధాన పుష్కర ప్రాంతాల్లో 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి, వైద్యులు, అత్యవసర మందులు, అంబులెన్స్‌లను ముందుగానే సిద్ధంగా ఉంచాలని సూచించారు. భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేసి, అవసరమైన చోట్ల ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టాలని అన్నారు. పోలీసు, రెవెన్యూ, దేవాదాయ, వైద్య, మున్సిపల్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా రూ.1,000 కోట్లతో అభివృద్ధి పనులు
ఆలయ ఈవో కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గోదావరి పుష్కరాల పనులను ఏడాది ముందుగానే ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పుష్కరాల కోసం దాదాపు రూ.1,000 కోట్లతో వివిధ అభివృద్ధి, మౌలిక వసతుల పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. బాసరతో పాటు గోదావరి నదీ తీర జిల్లాల్లోని మొత్తం 12 ప్రాంతాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పనుల నాణ్యత, పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమించినట్లు తెలిపారు. ప్రజాభవన్‌లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా బాసర గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, పుష్కర ఘాట్ల అభివృద్ధి, శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన మ్యాపులు, ప్రతిపాదనలు, పనుల పురోగతిని మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీ సాయి కిరణ్, ఆలయ ఈవో అంజనా దేవి, తహసీల్దార్ పవన్ చంద్ర, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.