భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: కాలుష్యరహిత పటాన్చెరు లక్ష్యంగా MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన “3K రన్ – పొల్యూషన్ ఫ్రీ పటాన్చెరు సీజన్-2 – రన్ ఫర్ నేచర్” కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. పటాన్చెరు పరిధిలోని JP ఫార్మ్స్, ORR సర్వీస్ రోడ్ సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ 3K రన్లో యువత, మహిళలు, విద్యార్థులు, చిన్నారులు, సీనియర్ సిటిజన్లు, పరిశ్రమల ప్రతినిధులతో పాటు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పటాన్చెరు ప్రాంతాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని నిర్వాహకులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణపై సమాజంలోని అన్ని వర్గాల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. “కాలుష్యరహిత పటాన్చెరు ఒక్కరి లక్ష్యం కాదు.. మనందరి సమిష్టి సంకల్పం” అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రజలంతా బాధ్యతగా ముందుకు రావాలని కోరారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారికి నిర్వాహకుల తరఫున ధ్రువపత్రాలతో పాటు మొక్కలను అందజేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసు శాఖ, పరిశ్రమల ప్రతినిధులు, వాలంటీర్లు, ప్రజలకు మాద్రి పృథ్వీరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో “రన్ ఫర్ నేచర్” కార్యక్రమం విజయవంతమైందని నిర్వాహకులు తెలిపారు.