భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి నిలిచిన పోరాట యోధుడు, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించిన ధీరుడు, స్వాతంత్ర్యం అనంతరం ప్రజాస్వామ్య భారత పార్లమెంట్లో వెనుకబడిన తెలంగాణ ప్రాంతాల గొంతుకగా మారిన ప్రజానాయకుడు ఇటికాల మధుసూదనరావు అని సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు దొంతు యాదగిరి (డీవై గిరి) పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాయుధ పోరాటం నుంచి పార్లమెంటరీ రాజకీయాల వరకు సాగిన ఆయన జీవితం తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయమని పేర్కొన్నారు.
నాటి మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి తొలితరం ప్రజాప్రతినిధిగా ఆయన అందించిన సేవలు నేటికీ గుర్తుండిపోయేలా ఉన్నాయని అన్నారు. 1918 ఏప్రిల్ 5న నాటి వరంగల్ జిల్లా కమలాపూర్ మండలం భీంపల్లిలో జన్మించిన ఇటికాల మధుసూదనరావు చిన్ననాటి నుంచే జాతీయోద్యమ భావజాలానికి ఆకర్షితులయ్యారని తెలిపారు.
దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కాలంలో హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం నిరంకుశ పాలనలో కొనసాగిందన్నారు. ప్రజాస్వామిక హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛ, రాజకీయ కార్యకలాపాలపై ఆంక్షలు ఉన్న ఆ కాలంలో యువకుడైన మధుసూదనరావు ఉద్యమ బాట పట్టడం ఆయన జీవితానికి కీలక మలుపుగా మారిందని చెప్పారు. 1938లో హైదరాబాద్ సంస్థానంలో పౌరహక్కుల కోసం సాగిన సత్యాగ్రహ ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొన్నారని, స్వామి రామానంద తీర్థ వంటి నాయకుల పిలుపుతో సాగిన ఉద్యమంలో పాల్గొని అరెస్టయిన తొలితరం ఉద్యమకారుల్లో ఆయన ఒకరుగా నిలిచారని వివరించారు. నిజాం ప్రభుత్వ ఆంక్షలను ధిక్కరించి ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడిన ఈ ఉద్యమం ఆయన రాజకీయ జీవితానికి పునాది వేసిందన్నారు.
దేశవ్యాప్తంగా బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమం మరింత ఉధృతమైన సమయంలో 1942లో క్విట్ ఇండియా ఉద్యమ ప్రభావంతో ఆయన కూడా జాతీయోద్యమ కార్యక్రమాల్లో పాల్గొని కారాగార జీవితం అనుభవించారని డీవై గిరి తెలిపారు. ఒకవైపు బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా భారతదేశం పోరాడుతుండగా, మరోవైపు హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య ఆకాంక్షలు బలపడుతున్న చారిత్రక పరిస్థితుల్లో ఇటికాల మధుసూదనరావు ఉద్యమకారుడిగా ఎదిగారని అన్నారు. హైదరాబాద్ సంస్థానం చివరి దశలో రజాకార్ల అరాచకాలు గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు సృష్టించాయని, ఖాసిం రజ్వీ నాయకత్వంలోని రజాకార్ల దాడులు, ప్రజలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా అనేక ప్రాంతాల్లో ప్రతిఘటన మొదలైందని వివరించారు. ఇటికాల మధుసూదనరావు కూడా ప్రజలను సమీకరించి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు. ఈ పోరాట కార్యకలాపాల కారణంగా ఆయనపై కేసులు నమోదు చేసి నిజాం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని, ఆయనకు 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించబడిందని చారిత్రక కథనాలు పేర్కొంటున్నాయని అన్నారు. అయితే హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన తర్వాత 1948 సెప్టెంబరులో ఆయన జైలు నుంచి విడుదలయ్యారని చెప్పారు. జైలు గోడల మధ్య గడిచిన ఆ కాలం ఆయన పోరాట స్ఫూర్తిని తగ్గించలేదని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం ఆయన ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి ప్రవేశించారని, ఉద్యమకారుడిగా ప్రజల కోసం పోరాడిన ఆయన ఎన్నికల రాజకీయాల ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో భారత జాతీయ కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా వ్యవహరించారని తెలిపారు.
1957లో జరిగిన రెండో లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి ఇటికాల మధుసూదనరావు పార్లమెంట్లో అడుగుపెట్టారని డీవై గిరి అన్నారు. అప్పటి వెనుకబడిన ప్రాంతంగా ఉన్న మహబూబాబాద్ పరిసర ప్రాంతాల సమస్యలను జాతీయ స్థాయిలో వినిపించే అవకాశం ఆయనకు లభించిందని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న నాయకుడు ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌కు చేరుకోవడం ఆయన రాజకీయ జీవితంలో మరో కీలక మలుపుగా నిలిచిందన్నారు. 1962లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ప్రజల విశ్వాసాన్ని పొందిన ఇటికాల మధుసూదనరావు వరుసగా రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారని తెలిపారు. ఎంపీగా ఆయన పదవీకాలం తెలంగాణ ప్రాంత అభివృద్ధి సమస్యలను జాతీయ స్థాయిలో ప్రస్తావించిన కాలంగా గుర్తించవచ్చన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్లు, రవాణా సౌకర్యాలు, రైల్వే మార్గాల విస్తరణ, సాగునీటి వనరులు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి వంటి అంశాలపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపారని వివరించారు.
నాటి మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని విస్తారమైన గ్రామీణ, గిరిజన ప్రాంతాల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన పాత్ర కీలకమైందని డీవై గిరి అన్నారు. స్వాతంత్ర్య పోరాట కాలంలో ప్రజల కోసం ఆయుధం పట్టిన వ్యక్తి, స్వతంత్ర భారతదేశంలో అదే ప్రజల సమస్యలను పార్లమెంట్ వేదికగా వినిపించడం ఆయన రాజకీయ జీవితంలోని విశిష్టతగా పేర్కొన్నారు.
అయితే ప్రజా జీవితంలో ఇంకా ఎంతో కాలం సేవ చేయాల్సిన వయసులోనే ఇటికాల మధుసూదనరావు జీవితం అకాలంగా ముగిసిందన్నారు. రెండోసారి ఎంపీగా కొనసాగుతున్న సమయంలోనే 1964లో ఆయన మరణించారని తెలిపారు. కేవలం 46 సంవత్సరాల వయసులోనే ఆయన కన్నుమూయడం మహబూబాబాద్ ప్రాంత రాజకీయాలకు తీరని లోటుగా నిలిచిందని అన్నారు.
ఇటికాల మధుసూదనరావు జీవితం ఒక సాధారణ రాజకీయ నాయకుడి ప్రయాణం కాదని డీవై గిరి పేర్కొన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన సత్యాగ్రహి నుంచి రజాకార్లకు ఎదురొడ్డి నిలిచిన యోధుడిగా, అక్కడి నుంచి స్వతంత్ర భారత పార్లమెంట్లో ప్రజా సమస్యలను వినిపించిన ప్రజాప్రతినిధిగా ఆయన సాగిన ప్రస్థానం చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని అన్నారు.
నేడు రాజకీయాలు పదవులు, ఎన్నికలు, అధికార కేంద్రాల చుట్టూ తిరుగుతున్న సమయంలో ఉద్యమం నుంచి ప్రజా ప్రాతినిధ్యానికి ఎదిగిన ఇటికాల మధుసూదనరావు వంటి నాయకుల జీవితాలను తిరిగి స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల కోసం జైలుకు వెళ్లిన నాయకుడు, అదే ప్రజల సమస్యలను పార్లమెంట్లో వినిపించడం ఆయన రాజకీయ జీవితంలోని అసలు గొప్పతనమని పేర్కొన్నారు.
నిరంకుశ పాలనకు ఎదురొడ్డి నిలిచిన ధైర్యం.. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకగా మారిన నిబద్ధత—ఇటికాల మధుసూదనరావు జీవితం నేటి తరానికి అదే సందేశాన్ని ఇస్తోందని డీవై గిరి అన్నారు.