భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: గడీలపై గళమెత్తి, తెలంగాణ రాష్ట్రంలో భూ పోరాటానికి నాంది పలికి, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని పురస్కరించుకుని పటాన్చెరు డివిజన్ పరిధిలోని రజక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన 41వ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే జీఎంఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ కీలక పాత్ర పోషించి, మహిళా చైతన్యానికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. ఆమె సేవలను గుర్తిస్తూ హైదరాబాద్లోని మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు నామకరణం చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా ఆమె వారసులకు సైతం సముచిత గౌరవం కల్పించారని పేర్కొన్నారు.
చాకలి ఐలమ్మ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే కొనియాడారు. సమాజంలో అన్యాయాన్ని, అణచివేతను ఎదుర్కొనే ధైర్యానికి ఐలమ్మ పోరాటం ప్రతీకగా నిలిచిందన్నారు. ఆమె ఆశయాలను స్మరించుకోవడంతో పాటు, ఆమె చూపిన పోరాట స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, రజక సంఘం అధ్యక్షుడు మహేష్, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.