భారత్ సమాచార్ ఏలూరు జిల్లా: కుక్కునూరు మండలం మిట్టగూడెం గ్రామంలో ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలు జరిగినట్లు అధికారుల విచారణలో తేలడంతో సంబంధిత సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే ప్రభుత్వానికి నష్టం జరిగినట్లు భావిస్తున్న నిధుల రికవరీపై స్పష్టత లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. గ్రామ పరిధిలోని మూడు చెరువుల్లో పనులు చేపట్టకపోయినా పనులు చేసినట్లు చూపించి కూలీల పేర్లతో హాజరు నమోదు చేసి వేతన బిల్లులు పొందినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ వ్యవహారంపై పీజీఆర్ఎస్లో ఫిర్యాదు అందడంతో అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు.
విచారణలో కూలీల నుంచి వివరాలు సేకరించిన అధికారులు పనులు, హాజరు నమోదు, వేతనాల చెల్లింపుల్లో పలు అవకతవకలు జరిగినట్లు గుర్తించినట్లు సమాచారం. వేతనాలు కూలీల ఖాతాల్లో జమ అయిన తర్వాత వాటిలో కొంత మొత్తాన్ని మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు వసూలు చేశారన్న ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఒక్కో గ్రూపునకు ఐదారు వారాల పాటు వేతన బిల్లులు నమోదైనట్లు సమాచారం. పనులు జరగకపోయినా హాజరు, కొలతలు, బిల్లులు నమోదయ్యే వరకు పర్యవేక్షణ ఎలా జరిగిందన్న ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.
అధికారుల విచారణ అనంతరం నలుగురు మేట్లతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్లపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా పనులు వాస్తవంగా చేపట్టకపోయినా కొలతలు నమోదు చేసి వేతన బిల్లులు పెట్టేందుకు సహకరించారన్న ఆరోపణల నేపథ్యంలో టెక్నికల్ అసిస్టెంట్పైనా చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ల సందర్భంగా అవకతవకల మొత్తాలను రికవరీ చేయాలని సూచనలు ఉన్నప్పటికీ, వాస్తవంగా ఎంత మొత్తం తిరిగి వసూలు చేశారన్న దానిపై స్పష్టత లేదు.
మిట్టగూడెం గ్రామంలో సుమారు రూ.30 లక్షల వరకు అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో, అధికారిక విచారణలో నిర్ధారణ అయిన నష్టం ఎంత? రికవరీ చేయాల్సిన మొత్తం ఎంత? ఇప్పటివరకు ఎంత వసూలు చేశారు? అనే వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది. అక్రమాలకు పాల్పడ్డ సిబ్బందిపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నప్పటికీ, ప్రభుత్వ నిధుల రికవరీ విషయంలో ఉన్నతాధికారుల లిఖితపూర్వక ఆదేశాలు వస్తే చర్యలు తీసుకుంటామని ఏపీవో తెలిపినట్లు సమాచారం. సస్పెన్షన్తోనే వ్యవహారం ముగుస్తుందా.. లేక ప్రభుత్వానికి నష్టం జరిగిన ప్రతి రూపాయినీ నిబంధనల ప్రకారం రికవరీ చేస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది.