భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, సెప్టెంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

1980s AI ఫొటో ట్రెండ్‌పై సైబర్ నేరగాళ్ల కన్ను.. జర జాగ్రత్త

1980s AI ఫొటో ట్రెండ్‌పై సైబర్ నేరగాళ్ల కన్ను.. జర జాగ్రత్త

భారత్ సమాచార్: ప్రస్తుతం సోషల్ మీడియాలో 1980ల వింటేజ్ ఫొటో ట్రెండ్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ChatGPT వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను ఉపయోగించి తమ ఫొటోలను 1980ల కాలం నాటి హెయిర్‌స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్‌తో మార్చుకుంటున్నారు. అయితే ఉచిత AI టూల్స్‌లో ఉండే వినియోగ పరిమితులు, కొన్నిసార్లు ఆశించిన స్థాయిలో ఫొటోలు రాకపోవడాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరతీస్తున్నారు. 1980s AI Trend పేరుతో నకిలీ యాప్‌లు, APK ఫైళ్లను రూపొందించి వినియోగదారులను ఆకర్షిస్తున్నారు.

థర్డ్ పార్టీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా పోస్టులు, అనుమానాస్పద లింకులు, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా ఈ ఫేక్ APKలను సైబర్ నేరగాళ్లు ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. 1980ల లుక్‌లో ఫొటోలను క్షణాల్లో మార్చుకోవచ్చంటూ నమ్మించి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా చేస్తున్నారు. తెలియని వనరుల నుంచి APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన వెంటనే వినియోగదారుల వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

మాల్వేర్‌తో కూడిన నకిలీ యాప్‌లు ఫోన్‌లోని ఫొటోలు, కాంటాక్ట్స్, గ్యాలరీ వివరాలను సైబర్ నేరగాళ్లకు చేరవేసే ప్రమాదం ఉంది. అంతేకాకుండా బ్యాంకింగ్ సమాచారం, OTPలు వంటి సున్నితమైన వివరాలను కూడా కాజేసేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. వ్యక్తిగత ఫొటోలు, డేటాను దొంగిలించి బాధితులను బెదిరింపులకు గురిచేసే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ట్రెండింగ్ పేరుతో వచ్చే ప్రతి యాప్‌ను నమ్మడం ప్రమాదకరమని సూచిస్తున్నారు.

AI ఫొటో ట్రెండ్‌లో పాల్గొనాలనుకునే వారు కేవలం అధికారిక, నమ్మకమైన యాప్‌లు, వెబ్‌సేవలను మాత్రమే ఉపయోగించాలని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. Google Play Store లేదా Apple App Store వంటి అధికారిక ప్లాట్‌ఫారమ్‌ల నుంచే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని చెబుతున్నారు. అపరిచిత లింకుల ద్వారా వచ్చే APK ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్‌స్టాల్ చేయవద్దని, అనుమానాస్పద అనుమతులు అడిగే యాప్‌లకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.