భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: గణేష్ నవరాత్రి ఉత్సవాలు, గణేష్ శోభాయాత్రను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలో ప్రజల మధ్య ఉన్న సోదరభావం, పరస్పర సహకారం ఎల్లప్పుడూ కొనసాగాలని ఆకాంక్షించారు. గణేష్ ఉత్సవాలు, శోభాయాత్ర సందర్భంగా ప్రతి ఒక్కరూ పరస్పరం సహకరించుకుంటూ ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించాలని సూచించారు.
ముస్లిం మత పెద్దలు తమ చిన్ననాటి అనుభవాలను జిల్లా ఎస్పీతో పంచుకున్నారు. గతంలో గణేష్ ఉత్సవాల సమయంలో హిందూ సోదరులతో కలిసి పాల్గొన్న సందర్భాలను గుర్తుచేసుకుంటూ, నిర్మల్లో ప్రజల మధ్య ఉన్న స్నేహభావం, సోదరభావం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.
గణేష్ నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన ఏర్పాట్లు, తమకు ఉన్న సూచనలు, సమస్యలను మత పెద్దలు జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. వారి సూచనలు, అభ్యర్థనలను జిల్లా ఎస్పీ సానుకూలంగా విని, ఎలాంటి సమస్య ఎదురైనా పోలీసు శాఖ అందుబాటులో ఉంటుందని, అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ప్రజలందరూ తనకు సమానమేనని, ఎవరికైనా ఏదైనా సమస్య లేదా ఇబ్బంది ఎదురైతే తనను సంప్రదించవచ్చని, వారి సమస్యలను విని పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
ఉత్సవాలు, శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ప్రజలందరి సహకారంతో నిర్మల్ జిల్లాలో శాంతి, సోదరభావం, పరస్పర గౌరవంతో గణేష్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిద్దామని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు కృష్ణ, ప్రవీణ్, సమ్మయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.