భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలోని దుర్గమ్మ దేవాలయం మార్గంలో రూ.63 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, భూగర్భ మురుగు కాలువ, తాగునీటి పైపులైన్ పనులకు మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రహదారులు, మురుగు కాలువలు, తాగునీటి సౌకర్యాల అభివృద్ధితో ప్రజలకు మరింత మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
దుర్గమ్మ దేవాలయం మార్గంలో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులను నిర్ణీత ప్రమాణాలతో పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను చేపట్టాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.