భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, సెప్టెంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

భైంసాలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

భైంసా గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు

భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: భైంసా పట్టణంలో మంగళవారం జరగనున్న వినాయక నిమజ్జన శోభాయాత్రను పురస్కరించుకొని పోలీసులు సోమవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ఫ్లాగ్ మార్చ్ పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా బస్టాండ్ వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ.. వినాయక నిమజ్జన శోభాయాత్రను ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు. గత రెండు సంవత్సరాలుగా నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా జరిగిందని, హిందూ, ముస్లిం సోదరులు సోదరభావంతో పండుగలను ప్రశాంతంగా జరుపుకుంటున్నారని తెలిపారు. పట్టణంలో 130కి పైగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

గణేష్ మండపాల నిర్వాహకులు నిమజ్జన శోభాయాత్రను వీలైనంత త్వరగా ప్రారంభించాలని సూచించారు. డీజేలను నిబంధనలు, నిర్ణీత పరిమితులకు లోబడి వినియోగించాలని స్పష్టం చేశారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

భైంసా గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు

నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా భైంసా ఏఎస్పీ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. బందోబస్తులో ఇద్దరు ఏఎస్పీలు, 14 మంది డీఎస్పీలు, 11 మంది సీఐలు, 33 మంది ఎస్సైలు, 700 మంది పోలీసు సిబ్బంది పాల్గొంటారని వెల్లడించారు.

భద్రతలో భాగంగా పట్టణంలో 100 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్ కెమెరాలు, 19 పికెటింగ్ పాయింట్లు, ఏడు మొబైల్ టీమ్స్, 25 రూఫ్‌టాప్ వాహనాలు, 30 మంది రూఫ్‌టాప్ సిబ్బంది, ఒక వజ్ర వాహనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శోభాయాత్ర మొత్తం పోలీసుల నిఘాలో కొనసాగుతుందని పేర్కొన్నారు.

అనంతరం భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు వద్ద నిమజ్జన ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.