భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులేనని, భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో వారి పాత్ర ఎంతో కీలకమని జిల్లా అదనపు కలెక్టర్ పాండు అన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
100 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
ఈ సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో ఉత్తమ సేవలు అందిస్తున్న 100 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు, వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల సేవలు కీలకమని కార్యక్రమంలో పేర్కొన్నారు.
ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రాధాన్యత
ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా ఉపాధ్యాయులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు
గురుపూజోత్సవంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు కార్యక్రమానికి హాజరైన వారిని ఆకట్టుకున్నాయి.
తెల్లాపూర్ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రత్యేకంగా అభినందిస్తూ రూ.26 వేల నగదు బహుమతిని అందించారు.