భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

22, సెప్టెంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. త్వరలో పౌష్టిక అల్పాహారం

త్వరలో సెంట్రలైజ్ కిచెన్ ప్రారంభోత్సవానికి సిద్ధం  మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ముఖ్యమంత్రి అల్పాహారం పథకం ద్వారా మెదక్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు అల్పాహారం అందించేందుకు ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.

కిచెన్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

మంగళవారం మెదక్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తెలంగాణ ప్రభుత్వం, హరే కృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్‌ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కిచెన్‌లో ఏర్పాటు చేసిన సామాగ్రి, వివిధ యంత్రాలను ఆమె పరిశీలించారు. యంత్రాల సామర్థ్యం, కిచెన్‌లో అందుబాటులో ఉన్న సామాగ్రి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

త్వరలో ప్రారంభోత్సవం

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. త్వరలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ముఖ్యమంత్రి అల్పాహారం పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికమైన అల్పాహారం అందుబాటులోకి వస్తుందని చెప్పారు.

త్వరలో సెంట్రలైజ్ కిచెన్ ప్రారంభోత్సవానికి సిద్ధం  మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

395 పాఠశాలల్లో 30 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం

ముఖ్యమంత్రి అల్పాహారం పథకం మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వర్తిస్తుందని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికమైన అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, విద్యాభ్యాసానికి తోడ్పాటు అందుతుందని పేర్కొన్నారు.

మెదక్ జిల్లా వ్యాప్తంగా 395 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 30 వేల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ పథకం వల్ల ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం అవుతాయని, తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందన్నారు.

పాల్గొన్న అధికారులు

ఈ కార్యక్రమంలో డీఈఓ రాజు, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, మెదక్ కిచెన్ ప్లాంట్ మేనేజర్ పునీత్ త్రిపాఠి, హెచ్‌కేఎం ట్రస్ట్ ఆర్గనైజర్ వీర, డిస్ట్రిబ్యూషన్ మేనేజర్ నవీన్, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం బ్రేక్‌ఫాస్ట్ ఇన్‌చార్జ్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.