భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: విశ్వబ్రాహ్మణ కులవృత్తులు చేసుకుంటున్న 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ నెలకు రూ.5 వేల పెన్షన్ అందించాలని, నిరుపేద విశ్వబ్రాహ్మణ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ నిజామాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మడుపు స్వప్న ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సందర్భంగా మడుపు స్వప్న మాట్లాడుతూ.. విశ్వబ్రాహ్మణ కులంలో ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలు చాలామంది ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు మారినా తమ సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ తమ బాధలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాల దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. ముఖ్యంగా కార్పొరేట్ జ్యువెల్లరీ షాపులు పెరగడంతో స్వర్ణకారులకు పనులు తగ్గిపోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చాలామంది తమ పిల్లలను కూడా సరిగ్గా చదివించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొన్నారు.
స్వర్ణకారుల వృత్తిని కాపాడేందుకు మంగళసూత్రాలను స్వర్ణకారుల వద్దే తయారు చేయించుకునేలా ప్రభుత్వం నిబంధనలు తీసుకురావాలని మడుపు స్వప్న కోరారు. కార్పొరేట్ జ్యువెల్లరీ షాపులు మంగళసూత్రాలను విక్రయించకుండా, వాటిని స్థానిక స్వర్ణకారుల వద్దే తయారు చేయించుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
స్వర్ణకారులు నిరంతరం సూక్ష్మమైన పనులు చేయడం వల్ల కంటి చూపు కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అందువల్ల 50 సంవత్సరాలు దాటిన ప్రతి స్వర్ణకారుడికి నెలకు రూ.5 వేల పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన విశ్వబ్రాహ్మణ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.
ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం విశ్వబ్రాహ్మణ కులవృత్తులు చేసుకుంటున్న 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ రూ.5 వేల పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని మడుపు స్వప్న మరోసారి విజ్ఞప్తి చేశారు. విశ్వబ్రాహ్మణుల సంక్షేమం, కులవృత్తుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు గంగా మోహన్ చారి, ప్రధాన కార్యదర్శి డి.ఎల్.ఎన్. చారి, ఉపాధ్యక్షురాలు వడ్ల కృష్ణవేణి, విశ్వబ్రాహ్మణ సోదర, సోదరీమణులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.