భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

5, అక్టోబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించిన మనోజ్ఞశ్రీ

నీట్‌లో ఉత్తమ ప్రతిభ, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ సీటు..

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన కుమ్మరి స్వప్న–శ్రీనివాస్ దంపతుల కుమార్తె మనోజ్ఞశ్రీ ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షలో ప్రతిభ కనబరిచి మంచి ర్యాంకు సాధించింది. ఈ ప్రతిభతో జనగామ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. చిన్ననాటి నుంచే డాక్టర్ కావాలనే లక్ష్యంతో మనోజ్ఞశ్రీ కష్టపడి చదువుతూ, పట్టుదలతో ముందుకు సాగింది. తన లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించి నీట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించింది.

ప్రస్తుతం వైద్య విద్యలో ప్రవేశాలకు తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించడం అంత సులభం కాదని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో వైద్య విద్యను అభ్యసించేందుకు భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని, అలాంటి సమయంలో మనోజ్ఞశ్రీ తన ప్రతిభతో నీట్‌లో మంచి ర్యాంకు సాధించి ప్రభుత్వ కళాశాలలో సీటు పొందడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు.

నీట్‌లో ఉత్తమ ప్రతిభ, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ సీటు..

తమ కుమార్తె చిన్ననాటి నుంచి డాక్టర్ కావాలనే లక్ష్యంతో కష్టపడి చదివిందని శ్రీనివాస్–స్వప్న దంపతులు తెలిపారు. తాజాగా జనగామ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించడం తమ కుటుంబానికి ఎంతో గర్వకారణంగా, ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. డాక్టర్ కావాలనే మనోజ్ఞశ్రీ లక్ష్యానికి ఇది తొలి అడుగని, భవిష్యత్తులో మరింత కష్టపడి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

మనోజ్ఞశ్రీ సాధించిన విజయంపై కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. ఆమెను అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నతంగా ఎదిగి మంచి వైద్యురాలిగా పేరు సంపాదించాలని ఆకాంక్షించారు.