భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల MLC ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులను పెద్ద సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేయించడంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. 2023 నవంబర్ నాటికి డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ సూచించారు. MLC ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఇనుగుర్తి మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్ అధ్యక్షతన వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల MLC ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే డా. మురళి నాయక్ పట్టభద్రుల ఓటరు నమోదు డెస్క్‌ను ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు.
డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. అర్హత ఉన్నవారిని గుర్తించి, వారందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. ఓటరు నమోదు ప్రక్రియను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమ పర్యవేక్షణ బాధ్యతలను AMC డైరెక్టర్ కొట్టం రాము, వార్డు సభ్యుడు నద్దునూరి ప్రశాంత్‌లకు ఎమ్మెల్యే అప్పగించారు. పట్టభద్రుల నమోదు ప్రక్రియ సజావుగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తమ్మడపెల్లి కుమార్, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకుడు సురేష్ నాయక్, రాష్ట్ర సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ శివ కుమార్, సర్పంచులు బానోతు రేణుక నరేష్, భూక్య లక్ష్మి వెంకన్న, సుజాత యాకయ్య, మీటు నాయక్, ముదిరెడ్డి కళావతి, శ్రీనివాస్ రెడ్డి, బద్రు నాయక్, నరేష్ నాయక్, సతీష్‌తో పాటు మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.