భారత్ సమాచార్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లాలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కల భారీ నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ ఎద్దు ఏకంగా ఓ ఇంటి పైకప్పుపైకి ఎక్కింది. మనుషులు ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికి అయినా వెనకాడం. ఈ విషయంలో మనుషులే కాదు జంతువులు కూడా దీనికి అతీతం కాదని నిరూపించింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు ఉదయం జరిగిన ఈ సంఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.
భోరజ్ మండలం నిరాల గ్రామానికి చెందిన రైతు షేక్ గఫూర్ తన ఎద్దును ఇంటి బయట కట్టేశాడు. అదే సమయంలో కొన్ని వీధికుక్కలు గుంపుగా వచ్చి ఆ ఎద్దుపై దాడికి ప్రయత్నించాయి. దీంతో భయపడిన ఎద్దు ప్రాణభయంతో కట్టు తాళ్లను తెంచుకుని పరుగులు పెట్టింది. అలా పరుగెడుతూ పక్కనే ఉన్న రాళ్ల కుప్పపైకి ఎక్కి అక్కడి నుంచి నేరుగా ఓ ఇంటి పైకప్పు మీదకు చేరి తన ప్రాణాలు కాపాడుకుంది. ఇంటిపై ఎద్దును చూసిన గ్రామస్థులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. తాళ్ళ సహాయంతో చాలా సేపు శ్రమించి ఎద్దును కిందకు దించారు. పైకప్పు మీదకు ఎక్కడంతో ఇంటికి స్వల్ప నష్టం వాటిల్లింది. ఈ ఘటనను చూసిన స్థానికులు తమ ఫోన్లలో వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టగా ప్రస్తుతం అవి వైరల్గా మారాయి.