భారత్ సమాచార్, తూర్పుగోదావరి జిల్లా: ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, అనాథలకు అంతిమ సంస్కారాలు నిర్వహించడం.. ఇదే లక్ష్యంగా గోకవరం మండలంలోని కైలాసగిరి నిర్వాహకులు సుంకర వీరబాబు అందిస్తున్న సేవలకు మరో గుర్తింపు లభించింది. ఆయన సేవా కార్యక్రమాలను గుర్తించిన మానవతా సంస్థలు కైలాసగిరికి రెండు ఫ్రీజర్లను ఉచితంగా అందజేశాయి. ఈ సహకారంతో గోకవరం మండల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి.
గతంలో గోకవరం ప్రాంతంలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల ఏర్పాట్ల కోసం రాజమహేంద్రవరం వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో ముఖ్యంగా పేద కుటుంబాలు ఆర్థికంగా, ప్రయాణపరంగా ఇబ్బందులు ఎదుర్కొనేవి. ఈ సమస్యను గుర్తించిన సుంకర వీరబాబు గ్రామ పెద్దలు, దాతల సహకారంతో గోకవరంలో కైలాసగిరిని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ముఖ్యంగా దిక్కులేని అనాథ శవాలకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అంత్యక్రియలు నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. కష్టకాలంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ, అవసరమైన వారికి 24 గంటలూ సేవలు అందిస్తున్నారు.
సుంకర వీరబాబు చేస్తున్న సేవలను గుర్తించిన మానవతా సంస్థలు కైలాసగిరికి రెండు ఫ్రీజర్లను అందించాయి. ఈ కార్యక్రమానికి తన వంతు సహకారంగా గజింగం సత్తిబాబు ₹.25వేల ఆర్థిక సాయం అందించి ఫ్రీజర్ కొనుగోలుకు తోడ్పడ్డారు. తాను కూడా మానవతా సంస్థలో సభ్యుడిగా సేవలందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా సుంకర వీరబాబు మాట్లాడుతూ.. గోకవరం మండలంలోని ఏ గ్రామానికి చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారైనా మరణించిన వారి కుటుంబాలకు అవసరమైన ఫ్రీజర్ సేవలను ఉచితంగా అందిస్తామని తెలిపారు. అత్యవసర సమయంలో ఎప్పుడు ఫోన్ చేసినా 24 గంటలూ అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు.
కైలాసగిరి సేవా కార్యక్రమాలకు తనతో పాటు పలువురు సభ్యులు, దాతలు అందిస్తున్న సహకారం మరువలేనిదని వీరబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ, అనాథలకు గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న కైలాసగిరి సేవలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి. మానవత్వానికి కులమతాలతో సంబంధం లేదని చాటుతున్న ఈ సేవా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.