భారత్ సమాచార్, తూర్పుగోదావరి జిల్లా: అర్నాబ్ తుఫాను సమయంలో విధులు నిర్వహించి తిరిగి వస్తుండగా వాగు ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన నాగంపల్లి ANM కారెం సత్యవతి కుటుంబానికి జిల్లా యంత్రాంగం అండగా నిలిచింది. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించింది. ఈ మొత్తాన్ని సత్యవతి మైనర్ కుమారుడు బొంతు గిరీష్ కింగ్ పేరుపై ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. సత్యవతి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, కష్టకాలంలో ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా తల్లిని కోల్పోయిన మైనర్ కుమారుడి భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కల్పించే ఉద్దేశంతో రూ.10 లక్షలను అతడి పేరుపై ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లు తెలిపారు.
కాగా, అక్టోబర్ 28న అర్నాబ్ తుఫాను విధులు ముగించుకుని కారెం సత్యవతి తన భర్తతో కలిసి బైక్పై ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో కోటీకేశవరం సమీపంలోని వాగు వద్దకు చేరుకోగానే వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగి ప్రమాదం చోటుచేసుకుంది. ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో సత్యవతి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఆమె మృతదేహం సీతానగరం మండలం నల్లగొండ గ్రామం వద్ద లభ్యమైంది.
విధి నిర్వహణ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో జరిగిన ఈ విషాద ఘటన కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. తల్లిని కోల్పోయిన చిన్నారికి భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా జిల్లా యంత్రాంగం అందించిన ఈ సాయం కొంతమేర అండగా నిలవనుంది.