భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

తూప్రాన్‌లో కార్డెన్ సెర్చ్.. 64 వాహనాలు సీజ్

తూప్రాన్ పోలీసుల కాటన్ సెర్చ్ in

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా మెదక్ జిల్లా పోలీసులు తూప్రాన్ పట్టణంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని 2బీహెచ్‌కే కాలనీలో బుధవారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. సుమారు 105 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్న ఈ ప్రత్యేక తనిఖీల్లో 450కు పైగా ఇళ్లను తనిఖీ చేయడంతో పాటు సరైన వాహన పత్రాలు లేని 64 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 61 బైక్‌లు, మూడు త్రిచక్ర వాహనాలు ఉన్నాయి.

తూప్రాన్ పోలీసుల కాటన్ సెర్చ్ in

మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ IPS ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించారు. తనిఖీల్లో భాగంగా నార్కోటిక్ డాగ్ జూబి సహాయంతో ఇళ్లలో, కాలనీలోని పరిసర ప్రాంతాల్లో మాదకద్రవ్యాల ఉనికి ఉందా అనే కోణంలో క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే ఫింగర్‌ప్రింట్ డివైజ్ ద్వారా వ్యక్తుల వేలిముద్రలను తనిఖీ చేసి, గతంలో నేరాలకు పాల్పడిన పాత నేరస్థులను గుర్తించే ప్రక్రియ చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలను పరిశీలిస్తూ నేర కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు.

తూప్రాన్ పోలీసుల కాటన్ సెర్చ్ in

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. తూప్రాన్ పట్టణంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు నివసిస్తూ తమ తమ పనులు చేసుకుంటున్నారని తెలిపారు. అయితే కొంతమంది వ్యక్తుల కారణంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని చెప్పారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వ్యక్తులను గుర్తించి, అలాంటి చర్యలను అరికట్టడమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.

సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగించడం మా ఉద్దేశం కాదు

తూప్రాన్ పోలీసుల కాటన్ సెర్చ్ in

పోలీసుల తనిఖీల వల్ల సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించడం తమ ఉద్దేశం కాదని అదనపు ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజల భద్రతకు భరోసా కల్పించడం, కాలనీల్లో నేరాలకు అవకాశం లేకుండా చూడటం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాలనీల్లో నివసించే వారి వివరాలు, పూర్వాపరాలను పరిశీలిస్తూ అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని చెప్పారు.

తూప్రాన్ పోలీసుల కాటన్ సెర్చ్ in

ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా, అసాంఘిక లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతోనే నేరాలను నియంత్రించి, ప్రశాంతమైన నేరరహిత సమాజాన్ని నిర్మించగలమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తూప్రాన్ DSP నరేందర్ గౌడ్, ఇన్‌స్పెక్టర్ వెంకటరాజ్ గౌడ్, నర్సాపూర్ CI రంగకృష్ణ, పలువురు SIలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.