భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ తెలిపారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి సరైన మద్దతు ధర లభించేలా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ.. రైతులు తమ పంటను విక్రయించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దళారులు, ప్రైవేట్ వ్యక్తులను నమ్మి ధాన్యం విక్రయించి మోసపోవద్దని, నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లను అమ్మాలని కోరారు. రైతులు కష్టపడి పండించిన ప్రతి గింజకు తగిన ధర అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందని వివరించారు.
ముఖ్యంగా సన్న రకం వడ్లు పండించిన రైతులకు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తోందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని, ధాన్యం సేకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. రైతులకు న్యాయం జరిగేలా కొనుగోళ్లు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రెడ్డిపల్లి సర్పంచ్ పద్మావతి అశోక్ గౌడ్, వార్డు సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.