భారత్ సమాచార్, ఉద్యోగం : అగ్నివీరులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఊరటనిచ్చినట్లు ప్రకటించింది. అగ్నిపథ్ నియామక విధానంలో మార్పులు చేస్తూ నాలుగేళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత రెగ్యులర్ సర్వీసులోకి ఎంపిక కాని వారికి మరో రెండేళ్లు సాయుధ దళాల్లో పనిచేసే అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించింది. దీంతో వారి మొత్తం సర్వీసు కాలం ఆరేళ్లకు పెరగనుంది. నవంబర్ 4న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో నాలుగేళ్ల తర్వాత ఉద్యోగం కోల్పోతామనే ఆందోళనలో ఉన్న అగ్నివీరులకు అదనపు అవకాశం లభించనుంది.
అదనపు రెండేళ్ల సర్వీసు సమయంలో అగ్నివీరులకు ప్రస్తుతం అందుతున్న వేతనం కంటే ఎక్కువ పారితోషికం చెల్లించనున్నారు. మొదటి ఏడాది నెలకు సుమారు రూ.43,500, రెండో ఏడాది రూ.47,500 వరకు వేతనం అందించే అవకాశం ఉందని వెల్లడైంది. ఈ రెండేళ్ల గడువు పూర్తయ్యాక సాయుధ దళాల్లో శాశ్వతంగా కొనసాగాలనుకునే వారికి మరోసారి అవకాశం కల్పిస్తారు. అయితే వారి పనితీరు, శారీరక సామర్థ్యం, అర్హతలు, నిర్దేశిత ఎంపిక ప్రమాణాల ఆధారంగానే తుది నిర్ణయం తీసుకుంటారు.
2022 జూన్ 14న ప్రారంభమైన అగ్నిపథ్ పథకం కింద ఆర్మీ, నేవీ, వైమానిక దళాల్లో నాలుగేళ్ల కాలానికి యువతను అగ్నివీరులుగా నియమిస్తున్నారు. ఈ విధానంలో భాగంగా మొదటి బ్యాచ్‌కు చెందిన 18,300 మందికి పైగా అగ్నివీరులు 2026 చివరి నాటికి నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకోనున్నారు. తాజాగా సర్వీసు పొడిగింపుతో పాటు నైపుణ్య ధ్రువీకరణ పత్రాలు అందించడం, రిక్రూట్మెంట్లో ముందుగా రాత పరీక్ష నిర్వహించి ఆ తర్వాత ఫిజికల్ టెస్టులు చేపట్టడం వంటి మార్పులను కూడా ప్రకటించారు. మొత్తంగా ఈ నిర్ణయం అగ్నివీరులకు మరింత కాలం దేశానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించనుంది.