భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

5, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

ఎల్‌నినో ఎఫెక్ట్.. నీటి పొదుపుపై గ్రామాల్లో అవగాహన

ఎల్నీనో ప్రభావాలపై చండి గ్రామంలో కళాజాత ప్రదర్శన

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఎల్‌నినో ప్రభావాలు, వాతావరణ మార్పుల నేపథ్యంలో నీటిని పొదుపుగా వినియోగించుకోవడంతో పాటు పశువులను ఎండ వేడి నుంచి కాపాడుకోవాలని కళాకారులు ప్రజలకు సూచించారు. మెదక్ జిల్లా శివంపేట మండలం చండి గ్రామంలో వాతావరణ మార్పులపై అవగాహన కల్పించేందుకు కళాజాత ప్రదర్శన నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ ప్రతిభా సింగ్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి రామచంద్రరాజు ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కళాజాతలో భాగంగా కళాకారులు పాటలు, ప్రదర్శనల ద్వారా ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు.

గత వర్షాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని, దీంతో జలాశయాలు పూర్తిస్థాయిలో నిండకుండా ఖాళీగా ఉన్నాయని కళాకారులు వివరించారు. రానున్న రోజుల్లో నీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ నీటితో సాగు చేసే ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. అందుబాటులో ఉన్న నీటిని వృథా చేయకుండా అవసరాలకు అనుగుణంగా పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు.

పెరుగుతున్న ఎండల తీవ్రత నుంచి పశువులు, మేకలు, గొర్రెలను రక్షించుకోవడంపై కూడా అవగాహన కల్పించారు. వాటిని ఎక్కువ సమయం నీడలో ఉంచాలని, ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే మేతకు తీసుకెళ్లాలని సూచించారు. వాతావరణ మార్పుల కారణంగా ఎండల తీవ్రత ముందుగానే పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

వేసవిలో విద్యుత్ వినియోగం పెరిగే పరిస్థితులు ఉన్నందున ప్రతి ఒక్కరూ విద్యుత్‌ను కూడా పొదుపుగా వినియోగించుకోవాలని కళాజాత ద్వారా సందేశం ఇచ్చారు. నీరు, విద్యుత్ ఆదా చేయడం, పశువుల సంరక్షణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో కళాకారులు కొమ్ముల శేఖర్ గౌడ్, నేనావత్ మదన్ సింగ్, ధరావత్ రాజు, శివోళ్ల కృష్ణ, కారంగుల మాధవి పాల్గొని తమ ప్రదర్శనలతో ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామ ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు.