భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఒకవైపు సాగునీరు అందక రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితి.. మరోవైపు అదే చెరువు నుంచి ప్రైవేట్ రిసార్ట్ అవసరాల కోసం నీటిని తరలిస్తున్నారనే ఆరోపణలు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాయరావు చెరువు నీటి వినియోగంపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రజల అవసరాలు, వ్యవసాయానికి ఉపయోగపడాల్సిన చెరువు నీటిని ప్రైవేట్ రిసార్ట్‌కు తరలిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి.
రైతులకు సాగునీరు కరువు.. రిసార్ట్‌కు మాత్రం చెరువు నీళ్లా?
రాయరావు చెరువు కింద సాగు చేస్తున్న రైతులు నీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చెరువు నుంచి సాగునీటిని విడుదల చేయాలని రైతులు కోరగా, జిల్లా అధికారుల అనుమతులు లేవని, నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని నీటిపారుదల శాఖ అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో పంటలకు నీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇదే సమయంలో అలంకార రిసార్ట్ యాజమాన్యం చెరువు నుంచి అక్రమంగా మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తోడుకుంటోందనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. సాగునీటి కోసం రైతులు ఎదురుచూస్తుంటే, ప్రైవేట్ రిసార్ట్ అవసరాలకు చెరువు నీరు ఎలా వినియోగిస్తున్నారనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. రైతులకు నీరు విడుదల చేసేందుకు అనుమతులు లేవని చెబుతున్న అధికారులు, రిసార్ట్‌కు నీటి తరలింపు జరుగుతోందనే ఆరోపణలపై ఏం సమాధానం చెబుతారనే చర్చ మొదలైంది.
మోటార్లు సీజ్ చేసిన అధికారులు
ఈ వ్యవహారంపై స్పందించిన మున్సిపల్, నీటిపారుదల శాఖ అధికారులు అక్రమంగా ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మోటార్లను సీజ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.
అనుమతులు ఉన్నాయా? విచారణ జరపాలి
రిసార్ట్ యాజమాన్యానికి చెరువు నీటిని వినియోగించుకునేందుకు అధికారిక అనుమతులు ఉన్నాయా? అనుమతులు లేకుండానే నీటిని తోడుకుంటున్నట్లయితే ఇంతకాలం సంబంధిత శాఖల పర్యవేక్షణ ఏమైనట్లు? రైతులకు సాగునీరు అందించలేమని చెబుతున్న అధికారులు ప్రైవేట్ రిసార్ట్ నీటి వినియోగంపై ఎందుకు చర్యలు తీసుకోవాల్సి వచ్చిందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
కేవలం మోటార్లను సీజ్ చేయడంతోనే ఈ వ్యవహారాన్ని ముగించకుండా, రాయరావు చెరువు నీటి వినియోగంపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమంగా నీటిని తరలించినట్లు నిర్ధారణ అయితే రిసార్ట్ యాజమాన్యంపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
చెరువులు ప్రజల ఆస్తులని, వాటి నీటిని ప్రైవేట్ అవసరాలకు వినియోగించుకునే విషయంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రైతుల పంటలు ఎండిపోతున్న సమయంలో చెరువు నీటి వినియోగంపై ఇలాంటి ఆరోపణలు రావడం అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రాయరావు చెరువు నీటి వినియోగంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు. రైతులకు సాగునీటి విషయంలో న్యాయం చేయడంతో పాటు ప్రజా వనరులను కాపాడాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులకు నీళ్లు ఇవ్వడానికి అనుమతులు లేవని చెబుతున్న అధికారులు, ప్రైవేట్ రిసార్ట్‌కు చెరువు నీటి తరలింపుపై వచ్చిన ఆరోపణల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.