భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రతి విద్యార్థి చిన్ననాటి నుంచే చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు పౌరులుగా తమ బాధ్యతలను కూడా తెలుసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు సూచించారు. చట్టాలపై అవగాహన ఉన్నప్పుడే అన్యాయాన్ని ఎదుర్కొని, సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా ఎదగగలరని తెలిపారు.
జాతీయ న్యాయ సేవా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని మెదక్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు రెడ్డిపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సాపూర్ MEO తారా సింగ్, లీగల్ సర్వీస్ న్యాయవాది కాట్రోత్ రాజు నాయక్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ఎంతో ముఖ్యమని చెప్పారు. ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో మహిళలు, బాలలపై జరుగుతున్న వేధింపులు, బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, సైబర్ నేరాల వంటి సమస్యల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలు, పోక్సో చట్టం, బాలల హక్కులు, సైబర్ నేరాల నివారణ చర్యలు, ఉచిత న్యాయ సహాయం వంటి అంశాలను విద్యార్థులకు వివరించారు. ఎవరైనా అన్యాయానికి గురైతే భయపడకుండా సంబంధిత అధికారులను సంప్రదించాలని, చట్టబద్ధమైన మార్గంలో న్యాయం పొందాలని సూచించారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్కరూ న్యాయానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో న్యాయ సేవాధికార సంస్థలు అర్హులైన వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని అవసరమైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులు తమకు తెలిసిన న్యాయపరమైన విషయాలను ఇతరులకు కూడా తెలియజేస్తూ సమాజంలో చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అనురాధ, బి. శేఖర్, కె.ఆర్. శ్రీనివాస్ గౌడ్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.