భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

అండర్‌-19 ఆసియా కప్‌లో సెహ్వాగ్ తనయుడి మెరుపులు..

అండర్‌-19 ఆసియా కప్‌లో సెహ్వాగ్ తనయుడి మెరుపులు..

భార‌త్ స‌మాచార్, స్పోర్ట్స్ : అండర్‌-19 ఆసియా కప్‌ 2026లో భారత యువ జట్టు విజయంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. శుక్రవారం ఒమన్‌లోని అల్ అమరత్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా, కెప్టెన్ లక్ష్య రాయ్‌చందానీ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో భారత్ టోర్నీలో తొలి రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుంది.

టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న భారత్.. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో నేపాల్‌ను 42.3 ఓవర్లలో 128 పరుగులకే పరిమితం చేసింది. భారత పేసర్ ఇషాన్ సూద్ కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేసి 10 ఓవర్లలో నాలుగు మెయిడిన్లతో 18 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అర్జున్ రాజ్‌పుత్ కూడా మూడు వికెట్లతో నేపాల్ బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు. నేపాల్ తరఫున దర్శ్ సోనార్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, ఆశిష్ లుహార్ 29 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు.

129 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు ఆర్యవీర్, లక్ష్య ఆరంభం నుంచే ఆత్మవిశ్వాసంతో ఆడారు. ఆర్యవీర్ నేపాల్ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ కేవలం 34 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. మొత్తంగా 52 బంతుల్లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్ లక్ష్య 63 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో 53 పరుగులు సాధించాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు అజేయంగా 129 పరుగులు జోడించడంతో భారత్ 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ విజయంతో గ్రూప్-ఏలో భారత్ రెండు పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. నెట్ రన్‌రేట్ 4.170గా నమోదైంది. ముఖ్యంగా ఆర్యవీర్ సెహ్వాగ్ బ్యాటింగ్ ప్రదర్శన క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. టోర్నీలో తదుపరి మ్యాచ్‌లో భారత్ ఆదివారం (నవంబర్ 8) చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో లభించిన భారీ విజయం నేపథ్యంలో ఈ పోరుపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.